Monday, June 7, 2021

మేలుకొలుపు - 9

 

మేలుకొలుపు

సంపుటి-1                                 సంచిక-9                                  01-11-91

స్వమంతవ్యంపై విమర్శా - సమీక్ష  2

సంచిక-8లో కొంతవరకు స్వమంతవ్యం పై పరిశీలన జరిపాము. అనేక ప్రశంసలు తప్ప విషయానికి సంబంధించినంతవరకు ప్రత్యేక విమర్శలు రాలేదు. విమర్శల కొరకై మరికొంత కాలమాగుటకంటే ఈ శీర్షికను ఇంతటితో ముగించి, ముందుముందు వచ్చే విమర్శలను స్పందన-ప్రతిస్పందన శీర్షికలో ప్రకటించుట ఉచితమనిపించుటచే ఈ శీర్షికను ఈ సంచికతో ముగిస్తున్నాను.

1. శ్రీ బోధ చైతన్య-వ్యాసాశ్రమంవారు. “మిత్రులు శ్రీ సురేంద్రబాబుకు - నేను, మేలుకొలుపు మీద పరిశీలనాత్మకంగా చెప్పడానికి ఇంకా టైం పడుతుంది. బౌద్ధతర్కం కోణం నుండి మీ భావాలను విశ్లేషిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మీరు పత్రిక గురించి చక్కని ప్రకటన చేసియున్నారు. నేనూ విషయం మీకు చెబుదామనుకున్నాను. చదవకుండా మూల పడేసే వాళ్ళకు పత్రిక పంపడం శుద్ధ దండుగ. ఎవరి నుండి పంపమని లేఖలు వస్తాయో వారికే పంపండి. ఇక అభిప్రాయాలూ, విమర్శలూ రాసేవాళ్లు చాలా తక్కువగానే ఉంటారు. విషయం అలాంటిది” అంటూ వ్రాశారు.

2) నర్సీపట్నం నుండి జి.బి.యస్.శేషగిరి, లెక్చరర్ గారు “సురేంద్ర గారికి నమస్కారములు మాసహాధ్యాయి; మిత్రులు శ్రీ త్రివేది ఆంగ్లోపన్యాసకులు గారి ద్వారా మీ పరిచయం జరిగి పత్రిక మొదటి నుండియు చూచుచుంటిని. మీ యభిప్రాయములూ, ఆలోచనలూ . చాలవరకు నాకు నచ్చినవి. మన పత్రిక సభ్యునిగా నేనేమైనా చేయుటకు సిద్ధముగా ఉన్నాను. నవంబరు రెండవ, మూడవ వారము లలో మిమ్ములను కలవాలనుకుంటున్నాను. అని వ్రాశారు.

3) జి. వెంకటరావు, పెదమద్దూరువారు. “సత్యాన్వేషకులు -సురేంద్రగార్కి నమస్కారములు. మీరు పంపుతున్న పత్రిక చాలా వాస్తవాలతో కూడుకొని యున్నది. మీరు ప్రచురిస్తున్న పుస్తకము తుళ్ళూరులో టి. పానకాలు వాళ్ళ యింటివద్ద చూశాను. సమాజములో జరుగుచున్న న్యాయ అన్యాయములను వాస్తవిక దృష్టితో ఆలోచించి సమాధానములు తెలుపుచున్నారు. సమాజములో జరిగే అన్యాయములను అరికట్టలేక పోయినా కనీసం మీ పుస్తకం చదివి కొంత మందయినా మారవచ్చు. వాస్తవిక దృష్టి, సత్యాన్వేషణమూ, ధర్మాచరణమూ కలిగినవాడు ఏ కాలములోనైనా జయింపగలడు. నాయందు దయుంచి పుస్తకము పంపగలరని ఆశిస్తూ పత్రికకై వేయికళ్ళతో ఎదురుచూస్తుంటాను. అంటూ వ్రాశారు.

4) యం. నరశింహారావు ఆంధ్రోపన్యాసకులు సిద్ధార్థ కళాశాలవారు, “పూజ్యులైన సురేంద్రగార్కి నమస్కారములు. ఆర్యా, మీరు పంపిన  మేలు కొలుపు పత్రికకు సంబంధించిన “7” సంచికలూ చదివినాను. ప్రజ్ఞాన్వితులైన మిమ్ము మొట్టమొదట అభినందించుచున్నాను. పత్రికకు పేరు పెట్టుటలోనే మీ ధ్యేయము చక్కగా వ్యక్తీకరింపబడినది. ముఖచిత్రమునందలి పదముల వివరణము లెస్సగా నున్నది. మీరు నాకు ఒక చైతన్య స్రవంతివలె గోచరించినారు. నిర్భీకత, విస్పష్టత, పదునైన విమర్శ, సత్యమునందలి మమకారము, సమాజోద్ధరణమూ మీ రచనలలో చోటు చేసికొన్నవి. మొదటి సంచికలో కంటే చివరి సంచికలలో వాక్య నిర్మాణమునందు పరిపక్వత ప్రతిఫలించుచున్నది. భాషా సరళత్వమునకు. మీరు పడు శ్రమ కన్నులకు కట్టినట్లు కనుపించుచున్నది. ముందు ముందు మీ రచనల ద్వారా పాఠకులను అలరించగలదని నమ్ముచూ మీవద్ద సెలవు తీసుకుంటున్నాను అంటూ వారి అభిప్రాయాన్ని తెలిపారు.

గతసంచిక లోవలెనే ఈ యభిప్రాయములున్నూ ప్రధానంగా ప్రశంసాత్మకములే కనుక ప్రత్యేకంగా సమీక్షించవలసిందేమీ యగుపడుట లేదు. కోరినంతనే వారి యభిప్రాయములను పంపిన సాహితీవేత్తలకు కృతజ్ఞతలు. వారి ప్రశంసలను ప్రోత్సాహకాలుగా స్వీకరిస్తూ వారి నుండి సెలవు తీసుకుంటున్నాను. ఇహపోతే...

ఓం ప్రకాష్ హైద్రాబాద్ వారు “మీ స్వమంతవ్యం పై - సమీక్షా, విమర్శా వ్యాసంలో మీ భాషకు, భావానికి బాగా స్నేహం కుదిరింది. శైలి గోదావరి ప్రవాహంలా సాగిపోయింది. అయితే, విశ్వాసమూ, వివేకమూ అన్న రచనలో ఆ వేగము కొంత మందగించింది. గమనించగలరు అంటూ వ్రాశారు.

అలానే ఒకరిద్దరు లిఖితరూపంలో కాకుండా వారి అభిప్రాయాలు వెలిబుచ్చినారు. సందర్భోచితమైనంతవరకు వారి మాటలను వ్రాస్తున్నాను. గమనించండి.

శ్రీ బహ్మచారి గోపాల్, మళయాళ సద్గురు సేవాశ్రమంవారు తిరుపతిలో కలసినప్పుడు అభిప్రాయం వ్రాయండని అడుగగా ప్రత్యేకంగా చూపించదగ్గ దోషాలుంటే కదా విమర్శించడానికి. పత్రిక చక్కగానూ, సార్థక నామధేయంతోనూ ఉన్నది. అన్నారు.

 పత్రికలోని ఒకే ఒక అంశంపై ఒక విమర్శ వచ్చింది. వారు పోనీ ప్రచురణ కిష్టపడకపోయినా విషయ ప్రాధాన్యతనుబట్టి ప్రచురణ యోగ్య మనిపించుటచే క్రింద వ్రాస్తున్నాను. మీరూ పరిశీలించి ఉచితానుచితములను నిర్ణయించండి.

 సంచిక 8లో 5వ పేజీ, రెండవ పేరాలో ఒక విషయంలో ప్రతిపాదిస్తూ ఉదాహరణకై శంకరులనూ, వారు ప్రతిపాదించిన అద్వైతాన్ని ప్రస్తావించాను. అందుపై ఒకరు ఆయన సాహితీవేత్తయేగాక విమర్శకునిగానూ ప్రసిద్ది చెందిన వారే. “ఆ సందర్భంలో మీరు శంకరుల వారిని చాలా చులకనగా (నీచంగా) ప్రస్తావించారు. మీ మాటలకు నిందార్థం వస్తుందన్న గమనింపు ఉండే వ్రాశారా? పొరబడ్డారా? తెలిసే వ్రాస్తే దాని పై విమర్శించడానికి నావద్ద మాటలు లేవు. అంటూ లేఖ వ్రాశారు.

వెంటనే నేను ఆ సంచికను మరల పరిశీలించాను. నీచంగా అన్నదట్లుంచి, నావరకు నాకు ఆ సందర్భంలో నిందా వాక్యములున్నట్లున్నూ అనిపించలేదు. యదార్థంగా ఆ వాక్యాలు వ్రాసేటప్పుడు నా మనోవీథిలో శంకరులనో, అద్వైతాన్నో నిందించాలన్న యోచన కూడా లేదు.  సామాన్యులనుండి, మేధావులవరకు ఎవరైనా ప్రమాదపడే అవకాశముందనీ, ఆ విషయం గమనించనిచో పునఃపరీక్ష చేసికునే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని, మాది పరీక్షింపనఖ్ఖర లేదు అన్న ధోరణి మంచిది కాదనీ చెప్పాలన్నదే నా దృష్టి. ఉదాహరణకు శంకరుల నుటంకించానేగానీ ఆ స్థానంలో రామానుజులనో, మరొకరినో ఉదహరించినా నేచెప్ప దలచిన విషయానికి ప్రమాదమేమీ లేదు. ఒక్క విషయం చెప్పితే ఈ సందర్భంలో ఉచితంగానూ, పాఠకులలో ముఖ్యంగా శంకరాభిమానులలో దోషదృష్టి ఏర్పడకుండానూ ఉండగలదు. శంకరుల పై మాకు వీరాభిమాన మేమీలేదు గానీ, సమాజంపట్లా లోకహితం పట్ల గల వారి. హృదయాన్ని చూడగలిగితే వారెల్లరూ మనకు పూజనీయులే. నన్నది నా వ్యక్తి గతాభిప్రాయం. పెద్దలుగా వారిని గౌరవించడం, ఆదర్శంగా తీసుకోవడం వేరూ, వారు చెప్పిన దానిలోని నిజా నిజాలు చూడడం వేరు. మీరూ 8వ సంచిక మరల పరిశీలించి, నా భావాలలోని ఉచితానుచితములు నిర్ణయించండి.

నమస్సులతో 

సత్యాన్వేషణలో,

         మీ సురేంద్ర.

సమావేశాలు-1

1 సమాలోచన శిబిరం: 16, 17, 18 తేదీలలో ముందుగా అనుకున్న ప్రకారమే కార్యక్రమం నడచింది. పరిశీలనాంశంగా ప్రమాణములు అన్న విషయాన్ని తీసుకున్నాము.

మానవ జీవితం జ్ఞానాధారంగా నడుస్తున్నది. అనుభవాలను పరిశీలిస్తే  కలుగుతున్న జ్ఞానం భ్రమ-ప్రమ అని రెండు రకాలుగా ఉన్నట్లు తెలుస్తున్నది. యీ రెండు విధములైన జ్ఞానములు (తప్పుజ్ఞానమూ, ఒప్పుజ్ఞానమూకూడ) ఏర్పడుతుండడం వలన జ్ఞానమేర్పడుతున్న క్రమాన్ని అర్థం చేసికోవలసిన అవసరం ముందుగా ఏర్పడుతున్నది. ఈ వివేకాన్ని పొందలేని మనిషి, కలిగిన జ్ఞానం సరైనదో కాదో సరిచూసుకోడు. కనుక ప్రమాదపడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. భ్రమ జ్ఞానం పొందిన మనిషి అఖ్ఖర లేని సాధ్యాలూ, సాధనలూ పెట్టుకొని చచ్చేవరకూ శ్రమిస్తుంటాడు. సాధారణాంశాలలోనైనా భ్రమజ్ఞానమన్నది, లేని సమస్యల్ని తెచ్చిపెడుతుంది. జీవితం పట్లా, జీవితంలో ఎదురయ్యే ఆయా సమస్యల పట్ల సరైన అవగాహన-యదార్థ జ్ఞానము-లేనిచో జీవిత ప్రయాణం సాఫీగా సాగదు. జీవిత మనునది ఒక నిరంతర కార్యక్రమంతో కూడిన ప్రయాణం వంటిది. దీనిని నడిపే జ్ఞానం అపసవ్యం గానో, అసమగ్రం గానో ఉందనుకోండి, ఇక ప్రయాణం ఎంతసొంపుగా ఉంటుందో, ఎంత సజావుగా సాగుతుందో ఆలోచించండి. కనుక యదార్థ జ్ఞానం అన్నది ఆ జీవితం ప్రతిక్షణమూ మనిషి కవసరమైయున్నది. ప్రతి మనిషి తనలో సహజంగానే ఏర్పడివున్న జ్ఞానేంద్రియాలూ, అవి పనిచేస్తున్న తీరూ, ఏమిటన్నది అర్థంచేసికోవలసి వస్తున్నది. పై జ్ఞాన పరికరాలూ, ఉన్న పద్ధతులూ అన్న వాటిని గూర్చి సమగ్రమైన అవగాహన కలిగి యుండడాన్నే ప్రమాణం వివేకమంటారు.

జీవితం సక్రమంగా సాగాలంటే నడిపేజ్ఞానం శుద్ధంగానూ, సమర్థవంతం గానూ ఉండాలి. కనుక ఉన్న పరికరాలు ఎటువంటి పరిస్థితుల్లో యదార్థ జ్ఞానమును కలిగించగలవో, ఎటువంటప్పుడు భ్రమ జ్ఞానాన్ని కలిగిస్తాయో, భ్రమలకు బాహ్య కారణాలేమో, మానసిక, దైహిక కారణాలేమైనా ఉన్నాయేమో గమనించాల్సి ఉంది. ఇంత వివేకమూ కలిగి ఉన్నప్పటికీ ఆయా విషయ జ్ఞానమును పొందు సమయంలో నిరంతర మెలకువ కలిగి యున్నగానీ భ్రమ జ్ఞాన మేర్పడ కుండా యధార్థ జ్ఞానమే కలుగునట్లు చేసికొనలేడు.

జీవితంలో ఇదెంత ప్రధానమైనదంటే ఇక్కడే మాత్రం పొరపడ్డా, తొందర పడినా ఆ పైచేయు ఆలోచనలూ, వాటి ననుసరించు యత్నాలూ అన్నీ అఖ్ఖరలేని వౌతాయి. అప్పుడిక ప్రారంభం నుండి ముగింపు వరకూ అంతా అనవసర వ్యవహారమే అవుతుందన్న మాట. ప్రస్తుత సమాజంలోని ఎక్కువ మంది జనులు జీవితం పట్ల - పొందవలసినవీ, పొందించునవీ అన్న వాటిపట్ల సరైన అవగాహన లేకనే భ్రమలతో ప్రయాణిస్తున్నారు. కనుక యదార్థ జ్ఞానము నార్జించుట ఎట్లో, భ్రమ జ్ఞాన మేర్పడకుండ నిరోధించుట ఎట్లో నేర్పవలసి ఉంది. అందుకై ప్రమాణ, తర్క విద్యలందు ప్రావీణ్యత సంపాదించ వలసి వస్తున్నది. అని ప్రమాణ విషయ-పరిశీలనకు ఉపోద్ఘాత రూపముగా భూమిక నేర్పరచుకుని, ప్రమాణ వివేచన కొంతవరకు సాగించాము.

ప్రమాణమనగా ప్రమాకరణమనీ... అనగా జ్ఞాన సాధనమనీ, అది రెండు విధములుగా నున్నదని అనుకున్నాము. (1) పరికరములనుబట్టి, (2) పద్ధతులను అనుసరించి. అసాధారణ కారణం కరణమవుతుంది. జ్ఞాన ప్రక్రియలో పరికరాలకూ, విధానానికి కూడా కరణపదము-అసాధారణత్వము- అన్వయించగలదు.

ప్రథమ పక్షమైన పరికరములననుసరించి ప్రమాణములారు. అవి జ్ఞానేంద్రియములే ఈదృష్టి నుండి ప్రమాణముల పేర్లు ఎట్లుంటాయో మీ అనుభవాన్ని చూసి వ్రాయండి. అట్లు చేసినచో అది మీకు స్వానుభవ జ్ఞానంగా ఉండి జీవితమునకు ఉపయోగించగలదు.

Note:-జ్ఞాన ప్రక్రియలో అంతరింద్రియం అన్ని యింద్రియ వ్యాపారములతోనూ కలసి పనిజేస్తూనే తన సొంత క్షేత్రంలోనూ జ్ఞానసాధకంగా ఉండగలుగుతున్నది.

ఇక పోతే పద్ధతులననుసరించి కలుగుతున్న జ్ఞానం రెండు రకములు ప్రత్యక్షమూ, పరోక్షమూనని. ప్రత్యక్ష పద్ధతిలో ఆయా ఇంద్రియముల కాయా అర్థములతో-విషయములతో సంబంధమేర్పడి సన్నికర్షలో నున్నంతవరకు తెలియబడుతూ ఉంటుంది. మరి పరోక్ష పద్ధతియందు కలుగుతున్న జ్ఞానమునకు రెండు అర్థములకు చెందిన సంబంధ జ్ఞానము ఆధారముగ ఉంటున్నది. ఈ సంబంధములనునవి అనేకంగా ఉంటున్నాయి. సహజ సంబంధాలు, కృతక సంబంధాలు ఉన్నాయి. వాటిలో మరల సామయికాలూ, సాంకేతికాలూనన్న విభాగము ఉంది). అది స్మృతి రూప మగుటచే వ్యాప్తి స్మరణమన్నది పరోక్ష జ్ఞానమున కాధార మగుచున్నది. ప్రత్యక్ష మందరకూ సామాన్యమే అయినా పరోక్ష జ్ఞాన విషయంలో ఆయా కాలాల నాటి మేధావులు దీనియందుగల తరతమ భేదాలననుసరించి వాటి సంఖ్యను రకరకాలుగా నిర్ణయించుకున్నారు. ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దమూ, ఉపమానమూనని ప్రమాణములను నిర్ణయించి కలుగుతున్న జ్ఞానమునంతనూ సంపుటికరించగలము. అధవా ప్రత్యక్షానుమాన శబ్దములందైనా జ్ఞానరాశి యిమడ గలదు. ప్రమాణ సంఖ్య అంతకు తగ్గినచో బహు చర్చల కాశ్రయమౌతుంది. మావరకు మాకు, ప్రత్యక్ష పరోక్ష జ్ఞానములున్నవనీ, అందుకు మౌలికంగా రెండు పద్ధతులవసరమనీ పరోక్షం మరల అనుమాన, శబ్దములుగా విభజించవలసి ఉంటుదనీ అనిపిస్తున్నది. ఈ విషయం మీరూ మీమీ యనుభవాల నుండి పరిశీలించండి. ప్రమాణ సంఖ్య అవగాహనా సౌలభ్యం కొరకు ఏర్పరచుకున్నదే ననియూ, ఆ విషయంలో వాదులాడ వలసినంత పనిలేదనియూ, ఆనుకున్నాము.

యధార్థ జ్ఞానమూ, భ్రమజ్ఞానమూ జీవితంలో ఏర్పడుతునట్లు అందరి అనుభవంలోనూ ఉన్నది. అయితే భ్రమ అనగా నేమో, భ్రమలకు కారణాలేమిటో, ఎన్ని రకములుగా అవి కలుగుచున్నవో, వాటిని తొలగించుకొనుట ఎట్లో అన్నది సామాన్య జ్ఞానం కలవారలు తెలిసికోలేరు. ఆయా జ్ఞాన ప్రక్రియలను గూర్చి విశేష పరిశీలనలు చేసినగానీ వాటి విషయం సంపూర్ణంగా తెలియుటలేదు. కనుక మీరూ ఎవరికివారు మనన కార్యంగా వారిని మీమీ యనుభవాల నుండి పరిశీలించి వ్రాయవలసి ఉంది. అని చెప్పాను. ప్రియ పాఠకులారా! మీరూ పై మనన కార్యాన్ని అనుసరించి మీమీ అనుభవాలను పరిశీలించి ఈ విషయంలో ఒక అవగాహనకు రండి. సమాలోచన సమావేశంలోని కొన్ని అంశములులివి. భ్రమల గూర్చి అనుకున్నది పై సంచికలో మీ ముందుంచగలను.

సమావేశం -2

19, 20 తేదీలలో ధర్మాచరణ మండలి. తిరుపతివారు విశ్వభారత్ విద్యానికేతన్ బైరాగిన్ పట్టెడలో సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీ పెంచలయ్య, బోధ చైతన్య, ప్రమోద చైతన్య, సోంప్రకాశ్, శ్రీనివాసులు, వేద పారాయణ, రఘుపతిరావుగార్లూ, నేనూ పాల్గొన్నాము. “మానవుడు సాధించుకోవలసినవి” అన్నది పరిశీలనాంశంగా పెట్టుకున్నాము. విషయాన్ని ప్రతిపాదిస్తూ నేను మాట్లాడునట్లు, మిగిలినవారు నే చెప్పుచున్న విషయములను పరిశీలించునట్లున్నూ అనుకున్నాము.

సాధ్యాలు రెండు రకములు. అంతిమ సాధ్యమూ, అవాంతర సాధ్యములూ నని. మానవ జీవితంలో దేనినుద్దేశించి నిరంతరం శ్రమిస్తున్నాడో అది అంతిమ సాధ్యమనియూ, దానిని సాధించుకొనుటకై అవసరమైన పరికరాలూ, విధానమూ నన్నవి అవాంతర సాధ్యములనీ చెప్పుకోవచ్చు. అంతిమ సాధ్యమన్నది పరమోద్దేశ్య రూపంలో ప్రారంభం నుండి ముగింపువరకూ ఉంటుంది. అయితే అవాంతర సాధ్యములు ముందుగా తెచ్చుకోవలసినవిగా ఉంటాయి. ఇంతవరకు విషయం చక్కగా అర్థమైయుంటే అవాంతర సాధ్యాలలో ప్రథమమూ, అత్యంత ప్రధానమూ నైనది సరైన జ్ఞానమేనని అవగతం కాగలదు. ఎందుకంటే నడిపిస్తున్నది జ్ఞానమే గనుక, అని జ్ఞాన ప్రాధాన్యతను ప్రతిపాదిస్తూ, అట్టి యధార్థ జ్ఞాన సాధనకు ప్రమాణవివేకం అవసరమని చెప్పి ఆగాను.

పరిశీలకులుగానున్న వారందరూ విషయం సముచితంగానూ, క్రమబద్ధం గానూ ఉన్నదనీ, ఆ పై చెప్పదలచిన విషయాన్ని వివరించండనగా ప్రమాణాల గూర్చి కొంత వివరించాను. మీరూ అవలోకించండి. ప్రత్యక్షంలోనూ, పరోక్షంలోనూ కూడా భ్రమలున్నాయనీ ఆ భ్రమలు లేకుండా చూసుకున్న గానీ యదార్థ జ్ఞానం కలుగదనీ చెప్పాను. సభ్యులలో ఒకరిద్దరు ప్రత్యక్షంలో భ్రమలుండవని అభ్యంతరం చెప్పారు. ఆ పై భ్రమలను గూర్చి కొంత చర్చ చేశాము. ప్రత్యక్ష భ్రమకు ఉదాహరణగా నీటి తొట్టిలో సగం వరకు ముంచబడ్డ కర్ర వంగినట్లుండుటను చెప్పి అక్కడ ప్రత్యక్షం కాక మరే పద్ధతిలో జ్ఞానం కలుగుతున్నదీ చెప్పమని అడిగాను. చెప్పేవాడు చెప్పుకుంటూ పోతుంటే మిగిలినవారు ఆయా విషయాలను సమగ్రంగానూ, ఒక క్రమంలోనూ పరిశీలించుట కష్టమౌతుందనీ, అందుచే ఒక్కో విషయాన్ని అందరూ వారి వారి అనుభవాలాధారంగా పరిశీలించి ధృఢమైన నిర్ణయానికి రావడం ఉత్తమమనీ, ఈసారి సమావేశమయ్యేలోపు ఆయా విషయాలు అందరూ పరిశీలించిరండని చెప్పి అప్పటికి ముగించాను.

మరో అంశంగా సమాజంలో మానవజీవితాన్నే ఆధారం చేసికుని అనేక సిద్ధాంతాలు ఎందుకు ఏర్పడినాయో, ఇంకనూ ఏర్పడనున్నాయో, గమనించవలసి యున్నదనీ చెప్పాను. నా అభిప్రాయం ప్రకారం వైవిధ్యానికీ, వైరుధ్యానికి కూడా తప్పుజ్ఞానమో, అసమగ్ర జ్ఞానమో కారణమై యుండాలన్నాను. ఎందుకంటే ఆయా సిద్ధాంతకారులందరకూ ఆధారస్థానం జీవితానుభవాలే కదా! అయితే ఒకే అంశానికి చెందిన నానా ప్రతిపాదనలలో ఏదో ఒకటి గానీ; వీటన్నిటికీ - వేరైన మరొక ప్రతిపాదన గానీ సత్యమవ్వగలదే గానీ, అన్నీ వాస్తవాలు కాజాలవు గదా! దీనిని నిర్ధారించుట ఎట్లు? కలుగుతున్న జ్ఞానము భ్రమా? వాస్తవమా? అన్నది ఎట్లు నిర్ణయించాలో ముందుగా నిర్ధారింప బడినగానీ ఆయా సిద్ధాంతకారుల ప్రతిపాదనలు సరైనవో కాదో నిర్ణయించుట కుదరదనీ చెప్పాను. కనుక ముందుగా మీకుగానీ, నాకుగానీ మరెవ్వరికిగానీ, కలిగిన జ్ఞానమునందలి సత్యాసత్యముల నిర్ధారించగల కొలమానికను-అందరూ అంగీకరించేదానిని-సిద్ధపరుపవలసి ఉంది. అది జరిగినగానీ ఆ పై పరిశీలనలు సాగవు. కనుక దీని విషయమూ ఆలోచించండి. ఈ విషయంలో ఒకే అభిప్రాయానికి రానిచో నేను ప్రతిపాదించు సిద్ధాంతమును ఆయా పరిశీలకులు వారివారి వ్యక్తిగత కొలతలనుండి కొలుస్తారు గనుక సత్యాసత్యాలు తేల్చబడవు. కనుక పరిశీలకులెవరికైనా, పరిశీలించే ముందుగానే, సత్యాసత్యములను నిర్ణయించడమెట్లా అన్నది తెలిసి ఉండాలని చెప్పి ఆ అంశాన్ని ముగించాను. ఈ సమావేశంలో వ్యక్తీకరింపబడ్డ విషయాలనూ, మరికొన్ని విషయాలను ఎవరికి వారు స్వయం గానూ కూడా పరిశీలించుకుని మరుసమావేశానికి వచ్చునట్లు నిర్ణయించుకున్నాము. నవంబర్-3,4,5, తేదీలు రెండో సమావేశం జరుగనున్నది. రెండో సమావేశానికి మరికొందరు మేధావులనూ, తాత్వికులనూ, తార్కికులను కూడా ఆహ్వానించుటకు నిర్ణయించు కున్నాము.

మరో అంశంగా అసలు మనం ఎందుకు ఇలా కలిశాము? మరల మరల ఎందుకు కలవాలనుకుంటున్నాము? అని ప్రశ్న వేసుకుని మనవల్ల సమాజానికి కాదగ్గ కార్యముందనీ, చేయవలసిన బాధ్యత కూడా మనపై వున్నదని చెప్పాను. అది నా యభిప్రాయం ప్రకారం 1) జీవితంపట్ల సరైన అవగాహన కలిగియుండుట, ఇతరులకు కలిగించుట 2) అట్టి వివేకం నడపిన మార్గాన మనం ప్రయాణిస్తూ ఇతరులనూ నడిపించుట, అంటూ ముగించాను. ఆయా విషయాలపై ఈసారి సమావేశంలో స్థూలంగా నైనా ఒక అభిప్రాయానికి రాగలమనే అనుకుంటున్నాను. పైసంచికలో మరిన్ని విషయాలు మీ ముందు ఉంచగలను.

విశ్వాసమూ - వివేకము -2

గతసంచిక లో విశ్వాసాన్ని గూర్చీ-వివేకాన్ని గూర్చి కొంతవరకు చెప్పుకున్నాము. వ్యాసం చివరిలో రెండు పదాలకూ నిర్వచనరూపంగా అర్థం చెప్పాను. పాఠకులా విషయాన్ని గమనించే ఉంటారని అనుకుంటూ మరికొన్ని విషయాలను చెపుతున్నాను. పరిశీలించండి.

తరచుగా సామాన్యులూ, మేధావులూ కూడా “విశ్వసించక చేసేదేముందయ్యా మనిషి. అన్ని విషయాలూ నీవే తెలిసికోగలవా?” అంటూ ప్రశ్నించి కొన్ని దృష్టాంతాలు చూపిస్తుంటారు. మీ అమ్మ చెప్పింది నమ్మక మీ తండ్రి ఎవరో ఎలా తెలిసికోగలవు? వైద్యుడు మందిస్తే వేసికోవడం తప్ప ఏమి చేయగలవు? అసలు ప్రతిదీ నీవే తెలిసికుని ప్రవర్తించాలంటే అయ్యే పనేనా? అది ఒక రకమైన మూర్ఖత్వమే కదా? అంటూ ఉంటారు. విచారణ మార్గమంటేనూ, తర్కమంటేనూ అదో పెద్ద భూతమనుకునే మరికొందరు. అమాయకాగ్రేసరులు నీ బిడ్డ నీకే పుట్టాడన్న ఋజువేమిటి? అని ఆవేశంగా కూడా నాతో అన్నారు. జీవితంలో జ్ఞానం యొక్క పాత్రేమిటో గమనించుకుని, ఆయా విషయాలకు చెందిన వివేకాన్నార్జించుకుని ప్రమాదరహితంగా జీవించండీ! ఈ విషయంలో చాలవరకు మేమూ మీకు తోడ్పడతాము, అని మేము చెపుతుంటే అదేదో వారే మా నెత్తిన పాలుపోస్తున్నట్లో, మేము వారికేదో అపకారం చేయబోతున్నట్లో అనుకుని వ్యతిరేకించేవారిని ఏమనుకోవాలి? అమాయకాగ్రేసరులనుకోక. జ్ఞానవంతులు కండి నాయనా అంటుంటే అదో పెద్ద బూతుపదంలా ఉంది కొందరకు. మూనవ సంఘంలో ఇది అత్యంత శోచనీయమైన విషయము కాదా? ఆలోచించండి.

మానవ జీవితంలో విశ్వాసం పాత్రే లేదని మేమనడం లేదు. అయితే-ఎక్కడ విశ్వసించక తప్పని పరిస్థితులున్నాయో, మరెక్కడ విశ్వాసాలతో పని లేదో, అలానే ఎట్టి విశ్వాసాలు ప్రమాదకారులో, మరెట్టివి ప్రమాద రహితములో గమనించ మంటున్నాము. ప్రమాణ వివేకం కలవారలకు వాటి క్షేత్రాలు (అవి ఎక్కడ పనిచేస్తాయో) స్పష్టంగా తెలుస్తూంటాయి గనుక ఆయా సందర్భాలలో వారు ప్రమాదపడరు.

తానున్న దేశంలో, తానున్న కాలంలో, ఉన్న - విషయాలను తెలిసికుంటానికి, రూఢి పరచుకోవడానికి కూడా ప్రత్యక్షమే సరిపోతుంది. ఈ విషయం తెలిస్తే, ఏ విషయాన్ని తెలిసికోమంటున్నామో గమనించకనే విశ్వాసం లేకుండా ఎలా బ్రతుకుతావయ్యా, అంటూ పై ఉదాహరణలు చెప్పరు. మేము చెపుతున్న జీవితావగాహనకు సంబంధించినంత వరకూ పై ఉదాహరణలు అసందర్భాలూ, విషమ దృష్టాంతాలూ అవుతాయి. ఎందుకనగా స్వీయజీవితం కంటె సమీపవర్తి నీకింకొకటి లేదు. అది నీవున్న కాలంలో, నీవున్న దేశంలోని విషయమే, కనుక దీనిని అర్థం చేసికొనుటకు మరొకరి మాటలతోనో, విశ్వాసం తోనో పనిలేదు. కానీ పై ఉదాహరణలో, తెలిసికోవలసినవాడు లేని కాలంలోనో, లేనిదేశంలోనో జరిగిన సంఘటనలు చూపారు. వాటిని నమ్మడమో, నమ్మక పోవడమో తప్ప పరీక్షించి తెలుసుకునే అవకాశమే లేదక్కడ. వైద్యుని ఉదాహరణలో మాత్రం కావాలంటే పరీక్షించి నిర్ధారించుకోగలము. ఈ విషయమింకా విపులంగా తెలియాలంటే విశ్వాసాన్ని మరింత సూక్ష్మంగా పరిశీలించాల్సి ఉంటుంది.

విశ్వాసమన్నది నిజంగా మానవజీవితంలో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నప్పటికీ ప్రతి విషయంలోనూ దానినే పట్టుకుని వేళ్ళాడడమంటే జ్ఞానం యొక్క పాత్రనే కొట్టివేయడమౌతుంది జీవితాన్నుండి. అంతకంటే అజ్ఞానమూ, భ్రాంతీ మరేముంటుంది? విశ్వానమన్నది రెండు విధాలుగా ఉంటున్నది. ఒకరకం విడువకూడనిది గానూ, మరొకటి స్వీకరించరానిది గానూ ఉన్నాయవి రెండూ. ఇక్కడే ఉందసలు కిటుకంతా. ఏ విషయం ముందుగా అంగీకరింపబడినా, కావాలనుకున్నప్పుడు అనుభవంలో పరిశీలించి నిగ్గు తేల్చుకోడానికి వీలవుతుందో అట్టివాటి పై గల విశ్వాసాలవల్ల పెద్ద ప్రమాదమేమీ వాటిల్లదు. ఈ కోవకు చెందిన విషయాలను చెప్పిన వారున్నూ తెలిసే చెప్పుటకు వీలుంది. మరోరకమైన విశ్వాసాలున్నాయి చూశారూ అవి చెప్పిన వారికిన్నీ తెలియవు. విన్నవారికి తెలియకపోవుటేగాక వాటిని గురించి యత్నించి తెలుసుకునే అవకాశం లేదు. అట్టి వాటికి చెందిన విశ్వాసాలు విడువదగినవిగా ఉన్నాయి. ఈ విషయమిప్పటికి పాఠకుల కర్థమైయుంటే ఈ రెండో కోవకు చెందిన విశ్వాసాల బరువు తొలగి జీవితం సగం తేలికౌతుంది.

బైబిల్ స్వర్గమూ, వైదిక స్వర్గ నరకాలూ, అలానే ఆ యా మత గ్రంధాల స్వర్గాదులున్నూ ఈ కోవకు చెందిన విశ్వాసాలే. కమ్యూనిస్టుల స్వర్గమైన కమ్యూన్ కూడా ఈ కోవకు చెందినదేనంటే మీకాశ్చర్యంగా ఉంది కదూ!! అవి నిరాధారాలే కాక, నిర్థారింప వీలు లేనివి కూడా. చెప్పిన వాడికి వాటి విషయం తెలియదు. విన్న వాడికీ తెలియబడదు. జీవితావగాహనాపరులకవి వాంఛనీయాలూ కావు. అలానే ఆశాభయ హేతువులూ కాజాలవు. వాటిని గూర్చి, ఎంత సమయం వెచ్చించినా ఒరిగేదేమీ లేదు. కాలహరణ తప్ప, వాటికై ఎన్ని సాధనలు చేసినా నిష్ఫలమే కాగలదు. జిజ్ఞాసువులారా! ఈకోవకు చెందిన విశ్వాసాలింకేమైనా ఉన్నాయేమో మీరు స్వయంగా పరిశీలించి ఒక పట్టికను తయారు చేయండి. అట్టి శ్రమ మీ జీవితానికెంతో ప్రయోజనకారిగానూ, మీ వివేకానికి కొంతైనా ఆలంబనగాను ఉండగలదు.

-:గమనికలు:-

 1) పిలుపు:- సత్యాన్వేషకులూ, సాధకులూ, సామాజిక హితకాంక్షులు అన్న వర్గములవారు మాతో కలసి పని చేయుటకూ, వ్యక్తిగత వికాసమునకై, జ్ఞానార్జనా, సాధనా చేయుటకు చేయి కలిపి ముందుకు రావలసిందిగా ఆహ్వానిస్తున్నాము.

2) నా రచనలూ, విమర్శా కూడా ఎవరో కొందరిని ఉద్దేశిస్తూ చేస్తున్నవి కావు. అయితే మార్పు అవసరమైన సందర్భాలలో ఆయా మార్పు పొందవలసి ఉన్న వారికి నా విమర్శలోని వేడి, వాడి చురుక్కు మనిపించవచ్చు. వివేకవంతులు తామే గుర్తించిగానీ, గుర్తింపచేయబడిగానీ అవసరమైన మార్పుపై యుత్నింతురు కదా! “మేలుకొలుపు” ఉద్దేశ్యమే తట్టడం అన్నది గమనించగలరు.

3) గతసంచికలో “పత్రిక కావాలంటూ లేఖలు వ్రాసినవారికే పంపుతాము అని ప్రకటించాను. కొందరనుండే లేఖలు వచ్చాయి, రెండోసారి గూడా, అదే సూచన, చేస్తున్నాను. ఈ సంచిక అందిన పిదపనూ లేఖలు వ్రాయని, వ్రాయలేని వారికి పత్రికలు పంపుట జరుగదు. ఈ సారైనా పంపుటలో గల వుద్దేశము హితకాంక్షా, వాత్సల్యములేనన్నది గమనించ గలరనుకొంటాను.

4) మీకూ, నాకూ కూడా సంతోషించదగ్గ విషయమేమంటే ఈ మాసం నుండి ప్రత్యేకంగా ఎంచుకోబడ్డ తాత్వికులూ, తార్కికులూ కూడా పత్రిక చూడబోతున్నారు. వారి వైపునుండి రాబోయే సూచనలూ, విమర్శలు కూడా యధార్థ సాధకులకూ, జిజ్ఞాసువులకూ, అలానే విషయాన్ని సమీక్షించే నాకూ మేలొనగూర్ప గలవని ఆశిస్తాను.

అభ్యాస క్రమము-4

మానవ జీవితాన్ని “సాధన” అన్న కోణంలో నుండి విశ్లేషిస్తే కొన్ని సూక్ష్మాంశాలు బయట పడతాయి. అవి...

(1) సాధించదలచుకున్న దానిని గూర్చి, దానిని సాధించి పెట్టగల వాటిని గూర్చీ, సాధన క్రమాన్ని అనుకున్న దొచ్చేంత వరకు చేయవలసిన పనిని గూర్చి సమగ్రమైన వివేకం కలిగి యుండటమూ

(2) ఆ వివేకము చెప్పిన మార్గాన్ని మరల మరల జీవితానికన్వయించి చూసుకొనుట ద్వారా దానియందు యిష్టతను పెంచుకోవటం జరగాలి. ఆయిష్టం యొక్క స్థాయి తీవ్రత నందిన కొలదీ, సాధన రూప కర్మ ప్రారంభింపబడి వేగవంతమవుతుంది. దీనిని సాధించాలనుకున్నా క్రమమిదేనన్నది గమనించాల్సి ఉంది. ఇంతవరకు అర్థం కాకుంటే ప్రయాణం ఒడిదుడుకులతోనే సాగుతుంది. మేమెరిగిన అనేక ఆధ్యాత్మిక కేంద్రాలలో ఈ మెలకువ లేకపోవడం తరచుగా గమనించాము. నిదానంగానూ, కూలంకషంగాను పరిశీలించి ఓ నిర్ణయానికి రండి.

స్వీయ జీవితపు వర్తమానస్థితినుండి [మీ గత జీవితమూ, ప్రస్తుత స్థితి, ఆవగాహన చేసుకున్న పిదప] ఏదో కోణంలో మార్పు యొక్క అవసరం గుర్తింపబడిన-గుర్తింపచేయబడిన-గానీ సాధన ప్రారంభించటానికి వేదిక ఏర్పడదు. అందువల్లనే ఆధ్యాత్మ ప్రబోధంలో ప్రధమ ప్రశ్న బోధకునిదై, సాథకుని నీకేంకావాలి? అని అడుగుటతో మొదలవుతుంది. దీనినే మరోవిధంగా చెప్పవలసి వస్తే-అందరకూ వర్తించేట్లు చెపితే - మానవుడు కోరతగింది-సాధించుకోవలసింది ఏమిటి? అన్న అంశం దగ్గర నుండే అభ్యాసక్రమము ప్రారంభం కావలసి ఉంది. ఆలోచించండి.

సాధ్యాలు రెండు రకములుగా ఉంటాయి (1) అంతిమ సాధ్యాలు (2) అవాంతర సాధ్యాలు. ఎందుకలా విడగొట్టవలసి వస్తోంది. ఒకదానిని సాధించు కోవాలనుకొన్నప్పుడు. దానిని [పరమ సాధ్యాన్ని] సాధించుటకు కావలసిన పరికరాలు, వానిని ఉపయోగించు విధానానికి చెందిన జ్ఞానము ముందుగా సాధించు కోవలసిన (వీటినే అవాంతర సాధ్యాలు అంటాము) అవసరం ఏర్పడుతున్నది. ఒకటి రెండు ఉదాహరణలిస్తాను. మీరున్నూ మరికొన్నింటిని పరిశీలించండి. (1) అన్నం కావాలి. ఇది ఉద్దేశ్యం-పరమసాధ్యం అనుకుంటే, దానిని సాధించేందుకు అవసరమైన పాత్రలూ, పొయ్యి వండు విధానము యొక్క జ్ఞానమూ, ముందు సాధించు కోవలసిన వగుచున్నవి. యివి సాధింప బడక, అసలు సమస్య పరిష్కరింప బడదన్న మాట. కనుక ఇవీ సాధ్యాలు అవుతాయి. అలానే (2) ఆనందం కావాలి ఇది పరమ సాధ్యం. అనుకుంటే, ఆనందాన్నిచ్చేవి తెచ్చుకోవలసిన వవుతున్నాయి. ఇవి అవాంతర సాధ్యాలు. ఇలా ఎన్ని కోణాలు చూడటానికి వీలుందో - మీ జీవితానుభవాల నుండి మాత్రమే-అన్నీ చూచి ఒక క్రమంలో వ్రాయండి.

పని ప్రారంభించటానికి కర్త (చేయువాడు), ఉద్దేశ్యము (కావాలన్న కోర్కె) ముందుగా ఉండాలి. ఈ రెండూ కూడక ప్రయత్నం మొదలే కాదు. ప్రయత్నం కూడా బలమైన కోర్కె ఉంటేగాని కోర్కె తీరేవరకు కొనసాగదు. ఈ రెండూ ఉండదగినంతగా ఉన్నా ఆ కోర్కెలో ఉన్న దాన్ని సాధించి పెట్టగల పరికరాలూ ఉపయోగించు విధానమూ సమర్ధవంతమైనవిగా నుండవలసి ఉంది. సాధన క్రమంలో ఇవి అవాంతర సాధ్యాలుగా ఉంటాయి. వీటిని ముందు సంపాదించుకుంటేగాని అసలు కావాల్సింది లభించదు. అభ్యాసి ముందుగా ఈ సంగతి గుర్తించ వలసి ఉంది. సాధకులారా! ఈ విషయంలో మీకు స్పష్టత ఉందో లేదో చూసుకోండి. లేక నేను సూచిస్తున్న అంశాలు అభ్యాసంలో ఉండవలసినవో కావో పరిశీలించి ఒక నిర్ణయానికి రండి. తేడా పాడాలు, సందేహాలు ఉంటే వివరణ కొరకు నాకు, (పత్రికకు) వ్రాయండి. సాధన ప్రారంభించడానికి ముందే గమనించవలసిన విషయం గనక దీనిని విడచి సాధన అసంగత మవుతుంది.

Note: విచారణ మార్గీయులకూ, విశ్వాస మార్గీయులకు కూడా ఇది అత్యవసరమై ఉన్నది.


సాధన-2

ఆయా సాధ్యాలననుసరించి, పరికరాలు, విధానము వేరువేరుగా ఉన్నప్పటికీ సాధనకు ఒక క్రమాన్ని పాటించుట అన్నది తప్పని సరి. ఎన్ని సమకూడి ఉన్నా అమలు పరచక పోతే ఫలితం లభించదు. మానవ జీవితంలో అనుకున్నవి సాధించలేకపోవటానికి అనేక కారణాలున్నా ఆచరణ శూన్యతయన్నది ప్రబల కారణమైయున్నది. చేయాలి, క్రమబద్ధంగా చేయాలి. ఇదే ఫలసిద్ధికి తిరుమంత్రం. మార్పుకు సాధారణ కారణం కర్మే. చక్కగా ఆలోచించి నిర్ణయానికి రండి. ప్రధమ సాధనగా నిర్ణీత వేళలలో మేల్కాంచుట, పరుండుట అన్నది ఉండాలను కొన్నాము కదా! రెండవ సాధనగా కాలకృత్యములు తీర్చుకొనుట (నిర్ణీత వేళలో క్రమపద్ధతిన అన్నది అన్ని సాధనలకు సాధారణమే) శారీరక పరిశ్రమా చేయవలసియుంది. ఈ- శారీరక పరిశ్రమ రెండు విధములు. (1) ఆరోగ్యము నిచ్చునది (2) బలము నిచ్చునది - ఆరోగ్య సాధనకై ఆసన ప్రాణాయామములు ఉచితములు. బలమునకై వ్యాయామము చేయుట తగియున్నది. ఆసనములూ, వ్యాయామమూ అన్న వాటిని గూర్చి అనుభవజ్ఞుల నుండి అభ్యాసరూపముగ గ్రహించుట మంచిది. కనీసం 10 ఆసననిలు 10 నిముషములలోనూ, 15 నిముషములు వ్యాయామమూ, 5 నిముషములు విశ్రాంతి ఉండునట్లు ప్రారంభములో కార్యక్రమమును నిర్ణయించు కోవలయును. పిదప యధాశక్తి, యధావకాశము ననుసరించి పరిశ్రమను పెంచుకొనవచ్చును. అమిత పరిశ్రమయూ అనవసరము. హెచ్చరిక:- ప్రథమ సాధనను గమనించారా? అవసర మేననియూ అనుసరింప దగినదే ననియూ అనిపిస్తున్నదా? లేదంటే ఎలాగో ఎందువల్లనో, పత్రికకు వ్రాయండి. అవునంటే ఇప్పటికది ప్రారంభింపబడి అమలు చేయబడుతున్నదో, లేదో చూడండి. ఆచరణలో లేక పోయినా, బలహీనంగా ఉన్నా ఏవిషయం లోనూ ప్రయోజన ముండదు.

జీవితానికి సంబంధించిన సాధనలు జీవితం ఉన్న అందరూ చేయవలసిందే. సాధనను జీవితంలో ఒక భాగంగా చేసుకోగలగడమూ, అది అలవాటుగా మారటమూ అన్నదే సాధన ఫలవంతము కావడానికి గల అసలు రహస్యము. రెండవ సాధనగా చెప్పబడ్డ, నిర్ణీత వేళలలో కాలకృత్యములు నెరవేర్చు కొనుట, శరీర పరిశ్రమ అన్న వానిని నేటి నుండే ప్రారంభించండి. 15 రోజుల పిదప ఆక్రమం మీలో శారీరకంగానూ, మానసికంగానూ తెచ్చిన మార్పులను నాకు తెలుపగలరని ఆశిస్తాను. సాధనను గూర్చిన అంశములు క్రమంగానూ, అభ్యసిస్తూనూ మాత్రమే గమనించుట శ్రేయస్కరము గాన మనమూ అట్లే సాగుదాము.

No comments:

Post a Comment