Thursday, January 1, 2009

సి.టి.ఎఫ్‌.కు మండలికి మధ్య నడుస్తున్న వివాదం



సి.టి.ఎఫ్‌. తరఫునంటూ రెండు ఇ-మెయిల్స్‌ నాకందాయి. ఒకటి రాజేంద్రప్రసాద్‌గారు ప్రకాష్‌గారికి పంపిన లేఖకు సమాధానంగా ప్రకాష్‌గారు పంపింది కాగా, రెండవది వివేక్‌ పేరన పంపిన మెయిల్‌. ఆ రెండు మెయిల్స్‌ పూర్తిగా చూడదలచుకున్నవారు వారినుండే వాటిని పొందండి. నేనుమాత్రం నడుస్తున్న సందర్భానికి అవసరమైనంతవరకే వాటిని ఉట్టంకిస్తాను.
గమనిక : సందర్భానికి చెందిందీ, తప్పనిసరైందీ అనదగింది ఏదైనా నేను చూపకుండా వదిలిపెట్టాననిపిస్తే మా ఈ వివాదాన్ని ఆద్యంతం నిశితంగా పరికిస్తున్న ఎవరైనా స్పందన ద్వారా నాకు తెలియజేయండి. వారన్నది యదార్థమైతే ఆ మేరకు పై సంచికలలో దానినీ ప్రకటిస్తాను.

1) కె.బి.ఆర్‌. ప్రసాద్‌గారు బి.ప్రకాష్‌గారికి వ్రాసిన లేఖ సారాంశం రెండు ముక్కల్లో చెప్పుకుంటే (1) సురేంద్రకు, మీకూ లోగడ జరిగిన సంభాషణల పూర్తి వివరాలు లేకుండా, వాటి విషయంలో మీ యిరువురి పోకడల తీరుతెన్నుల గురించి మా అభిప్రాయం వెల్లడించడం సరికాదు, (2) నాకు తెలిసి, నేనూ పాల్గొన్న వారి వేదిక, మీ వేదికల రెంటిలోనూ తేల్చుకోదలచింది మాత్రం 'పరిణామవాదం-సృష్టివాదం' అన్న రెంటిలో ఏది సరైందన్నదే. అందుకై ఆరంభించిన విచారణలో ముందుగా పరిణామవాదాన్ని ఎంచుకున్నాము. దాని విషయంలో రెండు వేదికలలో పాల్గొన్న వారమూ, అది నిరూపిత సత్యం అనడానికి వీల్లేని, శాస్త్రీయ సిద్ధాంతం అనదగిన వాదము, అన్న నిర్ణయానికి వచ్చాము. కనుక వేదికల లక్ష్యాన్ని చేరడానికి క్రమాన్నిబట్టి విచారణకు స్వీకరించాల్సింది ఇక సృష్టివాదమే. కనుక బాధ్యత వహించి మీరు-క్రైస్తవపక్షానికి చెందిన-మీ సృష్టివాదాన్ని ప్రతిపాదించండి.
దీనిపై ప్రకాష్‌గారు ప్రతిస్పందిస్తూ (1) సురేంద్రగారే తనకున్న తెలివితేటల్ని ఉపయోగించి వాస్తవాలను మరుగుపరచి విషయాన్ని ప్రక్కదారిపట్టించి తన వాదమే సరైందంటూ పాఠకుల్ని వప్పించే పనిచేస్తున్నారనుకుంటుంటే, మీరూ అలానే మాట్లాడుతున్నారేమిటి?
(2) మా లెక్క ప్రకారం క్రమం ఇదిగో యిలాగుంది. అంటూ 12, 13 అంశాలుగా లేఖవ్రాశారు. దాని మొత్తం సారాంశం ఇదిగో ఇలా వుంది.
ఎ) సురేంద్ర విషయాన్ని ప్రక్కదారి పట్టించాడని మీకందరకూ తెలుసు, (బి) ముందుగా పరిణామవాదంపై మీ వైఖరేమిటో చెప్పండి. ఆ విషయంపై ఒక ముగింపు ఏర్పడ్డాకనే మా సృష్టివాదాన్నిచర్చకు పెడతాము, (సి) లోగడ పరిణామవాదానికి ధర్మోడైనమిక్స్‌ సూత్రాలు విరుద్ధం అని మేము చెప్పిన దానిపై మీ వైపునుండి సమాధానం లేదు, (డి) సురేంద్ర వాళ్ళు నిర్వహించే వేదికలో ఒక సమావేశానికి మేము రాలేకపోయినందుకు ప్రతిగానే బాధ్యత వహించి సత్యోదయంలో మీటింగ్‌ పెట్టాము, (ఇ) అందులో సురేంద్ర మాట్లాడకుండా ఊరుకుని, తరువాత ఇష్టమొచ్చినట్లు సొంత పత్రికలో వ్రాయడం అనుచితం, (ఎఫ్‌) ఆ రాతలకు ప్రతిగా మాకు స్పందించడం తప్పనిసరైంది, (జి) ఇంతవరకు ఆయన మేమెరిగిన వాటికి సమాధానం చెప్పలా. కనుక మీరే మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వుంది. మీ పక్షానికి ఆధారంగా ఎత్తుకున్న పరిణామవాదం విషయంలో మీరేమిటో ప్రకటించి అది సరైందేనని తేల్చండి ముందు, (హెచ్‌) ఆయన్నడిగితే ప్రసాద్‌ లేఖ వ్రాశారు. ఇది చాలా హాస్యాస్పదం, (ఐ) ఇదంతా తేలిక కూడా. మీరూ మీకే సలహాలు చెప్పడం మొదలెట్టారేమిటి? (జె) అందరం సమానస్థాయి, హక్కులు కలవాళ్ళమే. సురేంద్ర ఎక్కువేమిటి? (కె) మీలో ఎవరివద్దయినా పరిణామవాదంపై తగినన్ని ఆధారాలుంటే దానిని రుజువుకు పెట్టండి. లేకుంటే కామ్‌గా వుండండి, (ఎల్‌) సురేంద్ర ఆస్థికుడూ, నాస్తికుడూ కాదు-సత్యాన్వేషి అయితే అన్వేషిగనే వుండమనండి, (ఎం) మండలి అధ్యకక్షుడుగా మాట్లాడదలచుకుంటే ముందతని జ్ఞానసిద్ధాంతం తాత్విక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి నిరూపించుకోమనండి. మీకైనా, ఆయనకైనా మమ్మడిగే హక్కు అప్పుడే వస్తుంది.
సురేంద్ర : ఈ విషయంలో నా స్పందనేమంటే; ఒక్కో విషయం బైటపడుతూ ప్రకాష్‌గారి పోకడ మరింత మరింత స్పష్టమవుతున్నకొద్దీ అతనిలో ఋజుత్వం లేదేమోనన్న నా ఊహ సరైందేనన్న నిర్ణయం కలుగుతూ వస్తోందినాకు.
అదే సమయంలో అమాయకులేమీ కాదని, (ఎ) ఎదుటివాళ్ళకు బాధ్యతలప్పగించడం, విధులను గుర్తుచేయడంలోనూ, (బి) అవకాశం దొరికితే లేని బాధ్యతలు, నియమాలు నెత్తినబెట్టడంలోనూ, (సి) అవే బాధ్యతలు విధులు తనకీ వర్తిస్తాయన్న నిజాన్ని మరుగుపరచడంలోనూ ఉద్దండ పిండం కూడాననీ అనిపిస్తోంది.
మరోమాటా చెప్పుకుంటేగాని, అతణ్ణి గురించి మరికొంత వివరంగా చెప్పుకున్నట్లుకాదు. పైన చెప్పుకున్న పనులు ఇతరులకు పురమాయించే సందర్భంలో, తనమీద తనకున్న అతివిశ్వాసంవల్ల కొన్ని తన పీకలమీదకే వచ్చే ప్రకటనలూ చేస్తూ వుంటారాయన. నిశితంగా ప్రత్యంశాన్ని పట్టిచూసే ఒడుపుగలవాడైతే వారిలోని ఈ దోషం కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది. ఇక ప్రకాష్‌గారి లేఖపై రాజేంద్రప్రసాద్‌గారు ఎలా స్పందిస్తారో చూడాల్సి వుంది. అయినా పత్రికద్వారా విషయం నలుగురి పరిశీలనకు చేరిందికనుకనూ, ప్రధానంగా సి.టి.ఎఫ్‌. తరఫున ప్రకాష్‌గారికీ, నాకూ మధ్యన మా వైఖరులు, విధానాలపరంగా తప్పొప్పులు చూపుకోడం, దానినీ నలుగురి ముందుంచడం నడుస్తున్న క్రమం కనుకనూ, ప్రసాద్‌గారినీ కలుపుకుని పాఠకులందరికీ, నిస్పాక్షికంగా చూడడానికి అవసరమైనవని నాకనిపించిన కొన్ని వివరాలు అందించడం తప్పనిసరైంది.
పాఠకులకో విజ్ఞప్తి : రాసిందే వ్రాయవలసి వస్తున్నా, విషయం ప్రక్కదారి పట్టకుండా చూసుకోవడం అన్నింటికంటే ముఖ్యం గనుక, పాఠకుల్లో ఎక్కువమంది సహజంగానే వాద ప్రతివాదాలు పట్టించుకున్నంత జాగ్రత్తగా విషయాన్ని పట్టించుకోకపోవచ్చునుగనుక, కీలకమైన వాటిని మళ్ళామళ్ళా గుర్తుచేయాల్సి వస్తోంది. ప్రకాష్‌గారూ; జరిగిన క్రమాన్ని తెలిసి వుండడం, క్రమాన్ని పాటించడం అవసరమనే అంటున్నారుగనుక క్రమం ఏమిటి? క్రమాన్ననుసరించి ఇక చేయాల్సిందేమిటి? అన్నదగ్గర స్పష్టత చేకూర్చుకుంటే సరిపోతుంది. అప్పుడు మళ్ళా వ్యక్తి పరీక్షనాపి, విషయ పరీక్షకు పూనుకోవచ్చు. ప్రస్తుతం మీమధ్య ఎవరి వైఖరెట్టిది అన్నదే పరిశీలనాంశంగా వుంది.
ప్రకాష్‌గారు క్రమమిదిగోనంటూ వ్రాసిందాన్ని, క్రమాన్ననుసరించి ఇప్పుడు జరగాల్సిందేమిటి? అని నేను వివరించిందాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి వుంది మీరంతా. ఎప్పుడైనా పరంపరగా సాగిన పనుల విషయంలో క్రమాన్ని సరిగా నిర్ణయించాలంటే అసలా పరంపరలో క్రమానికి చెందినవాటినిగా వేటిని పేర్కొనాలి? అప్రధానంగా చూసి, పట్టించుకోని వేమిటి? అన్నది తెలిసి వుండాలి. ఇది చాలా కీలకం. ఒక సమావేశమే అనేక పనుల సమాహారమైనప్పుడు ఆ సమావేశం మొదలెట్టినప్పటి నుండి ఎక్కడకొచ్చి ఆగిందో అంతవరకు జరిగిందాన్ని, అదీ ఏ విషయాన్ని తేల్చుకోడానికి క్రమం అవసరమైందో, అందుకు అవసరమైన వాటి క్రమాన్ని తెలుసుకోడానికీ, తేల్చుకోడానికి మాత్రమే యత్నించాలి మనం. ఉదాహరణకు ఒక సమావేశంలో నలుగురు వక్తలున్నారు. సమావేశం మధ్యలో ఒక వివాదం వచ్చింది. వివాదం ఆరంభం కావడానికి కారకులెవరు? అన్నది తేల్చుకోవాలి. ఇప్పుడూ, క్రమాన్ని గుర్తించాల్సిన అవసరం వుంది. ఆ వేదిక ఎవరి మాటలలో ప్రారంభమైంది, ఒకరి తరవాత ఒకరుగా ఎవరెవరు మాట్లాడారు. ఎంతమంది, మాట్లాడేవరకు వివాదం మొదలవలేదు. అన్నది ఒక క్రమాన్ని తెలుసుకోవడానికి పనికి వస్తుంది. ఈ క్రమం ఏయే వక్తలు వివాద కారణం కాదో తెలుసుకోడానికి పనికివస్తుంది. ఇక వివాద కారణమైన వక్త తెలిశాక అతని ప్రసంగంలోని ఏ భాగంలో వివాదాంశపు ప్రకటన వుందో తెలుసుకోడానికి ప్రసంగంలోని ప్రకటిత విషయాల క్రమం తెలియడం అవసరమువుతంది. కార్యక్రమంలోని క్రమాన్ని నిర్ణయించే సందర్భంలో ఇదెంతో కీలకమైన విషయం. మీరూ ఆలోచించి అవునో కాదో తేల్చుకోండి.
ఇప్పుడు మేము ఆరంభించిన వేదిక ఉద్దేశమేమిటో, అంటే ఏ విషయాన్ని తేల్చుకోడానికి అది ఉద్దేశించబడిందో, ముందు గమనించాలి. నిజానికిది ఆస్తికపక్షాన్ని కూలంకషంగా విచారించడానికి అంటే దాని సాధారణ, విశేషరూపాలను పరీక్షించి చూడడానికి ఉద్దేశింపబడింది. ఆస్తికపక్షంవారే వారి పక్షాన్ని ప్రతిపాదించడం ఆపి, దేవుడున్నాడా? లేడా? అన్న అంశంపై విచారణ మొదలెడదాం అన్నారు. (1) మండలికి సంబంధించినంతలో ఆ రెండు పక్షాల విచారణా, చేయవలసే వుండడమూ, ఇరుపక్షాలూ తమతమ పక్షాలను ప్రదర్శించడానికీ, ఎదుటిపక్షాన్ని విచారించడానికీ సిద్ధపడడమూ కలగలసి ఆ దిశగా విచారణను మలుపుతిప్పాము. ముఖ్యగమనిక : వారిద్దరూ సరేనంటే మండలికి అభ్యంతరమేమీ లేదన్నంతవరకే అక్కడ నా పాత్ర అన్నది గమనించండి.
అలా ఆస్తిక, నాస్తిక సిద్ధాంతాలను విచారించుదాం అనుకుని మొదలెట్టిన వేదికలో, ఇరుపక్షాలు కలసి పరిణామవాదమా? సృష్టివాదమా ఏది సరైంది? అన్న దగ్గరకు నెట్టుకొచ్చారు విచారణను. ఆ రెంటిలోనూ పరిణామవాదం సరైందో కాదో ముందు విచారింద్దాం. అది తప్పు సిద్ధాంతమని తేలితే ఆస్థికత దాని సాధారణ రూపంలో ఒప్పు సిద్ధాంతమని తేలినట్లే, అంటూ విచారణను ముందుగా పరిణామవాదంవైపుకు త్రిప్పిందీ ఇస్లాం, క్రైస్తవపక్షాలే. రెండో పక్షమైన భౌతికవాదులూ మాకభ్యంతరం లేదనడంతో నిర్వాహణంలో వున్న మేము సరేనన్నాము.
ఫజులుర్‌ రహ్మాన్‌గారూ మేమూ కలసి ఆరంభించిన వేదిక ఇక్కడకు చేరడంతో, నిర్వాహకులమైన మేమిరువురము మా పరిచయంలో వున్న ఆస్తిక, నాస్తిక పక్షాలకూ, ఇతరులకూ సమాచారం అందించి, రాదలచిన వాళ్ళందరూ రావచ్చనీ, రమ్మనీ పిలిచాము. 'పరిణామవాదపు బలాబలాలు ఏమిటి అన్నది విచారణీయాంశంగా తయారవడంతో, చర్చావేదిక తాత్విక విషయ పరిశీలన రూపాన్ని సంతరించుకుంది. అంటే ఈ సందర్భంలో ఫలానా వ్యక్తికి తెలిసిందెంత? అన్నది అప్రధానమై, అసలా విషయానికున్న సత్తా ఎంత అన్నది ప్రధానమవుతుందన్నమాట. దీనినే పారిభాషికంగా 'వాదబలపరీక్ష అనంటారు'. దీనిని పరిశీలించేటప్పుడు ఆ వాదాన్ని ప్రతిపాదించే పని ఒక్కటే చేయాలనిగానీ, ఫలానివాడే చేయాలనిగానీ నియమముండదు. పట్టింపూ వుండదు. ఎందరు కలసైనా, మరెందర్ని కలుపుకునైనా ఆ వాదాన్ని ప్రతిపాదించి రుజువుపరిచే పనిచేయవచ్చు. కనుకనే వారివారి ప్రామాణిక గ్రంథాలాధారంగనే పరస్పరం విభేధించుకునే, ఇస్లాం-క్రైస్తవ ప్రతినిధుల్ని, అభిలాషవున్న హిందూ (?) పక్షీయుల్ని కూడా పరిణామవాదం సరైందికాదని తేల్చి పనికి పూనుకోవచ్చిన్నాము. అలాగే భౌతికవాదంవారే అయినా, పలు విషయాలలో అంతర్గత విభేదాలున్న సంస్థలనూ పరిణామవాదం సరైందేనని ప్రతిపాదించి నిర్ధారించేపని చేయండని చెప్పాము.
గమనిక : చర్చావేదికల్లో ఈ తేడాను పాటించడం అత్యంత కీలకమైనదని, మౌలికమైంది కూడా. సిద్ధాంత విషయాలను పరిశీలించాల్సిన సందర్భంలో వ్యక్తి వ్యక్తుల అవగాహనా లోపాలనుగానీ, ప్రవర్తనలోని దోషాలనుగానీ పట్టించుకోవలసిన పనిలేదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే పట్టించుకోకూడదు. అదేమరి, వాదిబలం, అంటే ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తానంటున్నవాని అవగాహనేపాటిదన్నదిగానీ, అతని ప్రవర్తననెట్టిదన్నదిగానీ పరీక్షించాల్సి వచ్చినప్పుడు, ఆ సిద్ధాంతాన్ని చెప్పడానికి మరెవరినీ అంగీకరించకూడదు - మరొకతనికి సాయమూ చేయకూడదు. వ్యక్తి బలాబలాలు, లోపాలోపాలు పరిశీలనకు తీసుకున్నప్పుడు ఆ సిద్ధాంతం ఏపాటిబలం కలది? అన్నది అప్రధానమై అతని అవగాహనేపాటిది? సమాజంలోకి ఆ విషయాన్ని తీసుకొస్తున్న అతని ప్రవర్తనెట్టిది? అన్నవాటినే విచారించి చూడాల్సి వుంటుంది. ఈ తేడా తెలియకుంటే సిద్ధాంత విచారణలో వ్యక్తి విమర్శ, వ్యక్తి విచారణలూ సిద్ధాంత వివమర్శ చేరి విచారణ ఒక ముగింపుకు రాకుండా సాగిపోతుంటుంది-అత్యంత కీలకమైన ఈ రెండు పార్శ్వాలనూ వాటి మధ్యనున్న అంతరాన్ని అర్థంచేసుకుని, నడుస్తున్న సందర్భాన్నీ పట్టుకునుంటేగానీ మా ఇరువురిలో ఎవరిపక్షం అవసరమైన క్రమాన్ని సూచిస్తుందో మరెవరిది క్రమరాహిత్యాన్ని సూచిస్తుందో నిర్ధారించడం కుదరదు. ఇప్పుడు మళ్ళా అస్సలు విషయానికి వద్దాం.
అప్పటికి నడుస్తున్న మా వేదిక విషయ పరిశీలన ప్రధానమైనది. ఇందులో ఎవరెవరు ఏమేమి చెప్పారన్నదిగానీ, ముందెవరు చెప్పారు, ఎవనకెవరు చెప్పారన్నదిగానీ, అంత ప్రధానంకాదు. మొత్తంగా ఒకపక్షపు ప్రతిపాదనేమిటన్నదే ఇక్కడ అత్యంత ప్రధానమైన అంశం. ఆ పక్షాన్ని ప్రతిపాదిస్తున్నవారిలో వారిలో వారికి తేడాపాడాలు వచ్చి వారిలో వారే మాట్లాడుకుని సవరణలు, పూరణలు చేసుకునే వెసులుబాటు వుంటుందిక్కడ. అదంతా అయ్యాక వారివైపునుండి చెప్పాలనుకున్నది, లేదా చెప్పింది ఏదో అదే ఆపక్షపు వాదమవుతుంది.
ఒకవేళ చర్చనీయాంశమే, ఆస్తికపక్షంలో ఎవరెవరు ఏమేమి చెప్పారు? వారిలో ఎవరిది బలంగా వుంది. ఎవరు ఎక్కువ సమాచారం కలిగి వున్నారు? అన్నదైయ్యుంటే అప్పుడు వేదిక, వ్యక్తుల బలాబలాలను చూసేదిగా మారుతుందన్నమాట. ఈ విషయం స్పష్టంగా తెలిసివున్నవాడ్ని గనుకనే పరిణామవాదం సరైందికాదు' అన్న పక్షాన మాట్లాడడానికి ప్రకాష్‌గారు ముందుకొచ్చినా సరేనన్నాను, గౌస్‌గారు ముందుకొచ్చినా సరేనన్నాను, ఎవరెవరు మధ్యలో వచ్చి ఆపక్షాన్ని బలపరుస్తామన్నా సరేనంటూ వచ్చాను.
జరిగిన రెండు మూడు ఘటనలను చెప్పుకుంటే నేను నిర్వాహకునిగా నా పాత్రను ఖచ్చితంగా నిర్వర్తించానని మీకూ తెలుస్తుంది. (1) ఒకటి రెండు సందర్భాలలో గుమ్మా వీరన్నగారూ, మరి ఒకరిద్దరూ పరిణామవాదం విషయం అలా వుంచండి, ఇంతకూ మీ సృష్టివాదానికి ఆధారాలేమున్నాయో చెప్పండి అని ఖురాన్‌, బైబిల్‌పక్షాలవాళ్ళనడిగినప్పుడు, పరిణామవాదంపై చర్చ జరిగే సందర్భంలో సృష్టివాదాన్ని చెప్పి ఆధారాలు చూపమని ఎవరూ అడగకూడదు అని చెప్పి వారిని ఆపుచేశాను.
2) ప్రకాష్‌గారు సదస్సును హేళన చేసేలా 'అంత లోతైన విషయాలు మీరర్థం చేసుకోలేరులే' అనన్నప్పుడూ, ఆయన్ను గట్టిగా నిరోధించి, మరెప్పుడూ అలా మాట్లాడకండని హెచ్చరించాను.
3) జె.వి.వి. కార్యాలయం, చింతలబస్తీలో జరిగిన సమావేశం ఆరంభంలో గౌసుగారినీ, కాకినాడ రహమాన్‌గారినీ కూర్చుండబెట్టి మీ ఇద్దరిమధ్యనే విభేదం వుంది. పరస్పరం కొంత తేడా వుంది. సభలో ఒక పక్షంగా వుండాల్సిన మీరు చెరొకటి చెప్పకండి. ముందే కూడబలుక్కుని ఇద్దరికీ అంగీకారమైందే మీ పక్షంగా చెప్పండి అని సలహా చెప్పాను.
4) అలాగే రహమాన్‌గారూ పరిణామవాదంపై తన పక్షాన్ని ప్రకటించే సందర్భంలో ఖురాన్‌వాక్యాల్ని ఉట్టంకించబోగా, అదీ వేదికకు అనవసరం. ఆస్థికపక్షీయులు ఆస్థిక గ్రంథాల నుండి ఏమిటో ఉదహరించాల్సిన అవసరం లేదిప్పుడు. ఉదహరించకూడదు కూడా అనిచెప్పి వారినీ వారించాను. ఇలా వ్యక్తుల్ని అప్రధానం చేసుకుని, విషయాన్ని ప్రధానం చేసుకుని నిర్వహించానుకనుకనే, ఆ వేదిక సిద్ధాంత విచారణకు ఉద్దేశించబడింది అంటున్నాను. ఆ ప్రకారం క్రమాన్ని చెప్పాలంటే ఆస్థికులే ఎంచుకున్న 'పరిణామవాదంపై చర్చ' ఒక ముగింపుకు రావాలి. పిదప క్రమాన్ననుసరించే 'సృష్టివాదం' విచారణకు రావాలి. ఆ వేదికలో పరిణామవాదమా? సృష్టివాదమా? ఏది సరైంది? అన్నదే విచారణీయాంశం. తదన్యమైన దేనిని ఎవరు ప్రతిపాదించమన్నా, ప్రతిపాదించినా విచారణను ప్రక్కదోవ పట్టించినట్లే. ప్రకరణభంగం జరిగినట్లే.
ఆ వేదికలో పాల్గొన్నవారూ, పత్రికాముఖంగా వివరాలు చూస్తున్నవారూ అయిన యోచనాశీలులారా! ఆ మా వేదిక ఏ ఉద్దేశంతో ప్రారంభమై ఎక్కడికి వచ్చి చేరింది. అక్కడినుండి తరవాత కదలాల్సినదెటువైపుకు? అన్నదొక్కటే ఇక్కడ క్రమాన్ని నిర్ణయించడానికి అవసరమైన సమాచారం - దాని విషయంలో వాస్తవం ఇదే. ఇది నిజమో కాదో సహ నిర్వాహకులుగానున్న ఫజులుర్‌ రహ్మాన్‌గారు చెపితే బాగుంటుంది.
వేదిక ఆస్తిక సిద్ధాంతాన్ని పరిశీలించడానికే ఉద్దేశింపబడింది. ముందు పరిణామవాదాన్ని పరీక్షించి, తరవాత ఆస్తికపక్షాన్ని పరీక్షించుదాం, అని ఆస్తికులనుండే ప్రతిపాదన రాగా, అందరం సరేననుకుని అక్కడ మొదలెట్టాం. ఆ సందర్భంలో ప్రకాష్‌ (బైబిల్‌పక్షం), గౌస్‌, రహ్మాన్‌, తారిఖ్‌ వగైరాలు (ఖురాన్‌పక్షం), పరిణామవాదం తప్పైతే మూడో ప్రత్యామ్నాయం లేదుగనుక ఆస్తికవాదం సరైందని తేలినట్లే అందామని, అనుకోవాలని ఒప్పించేందుకు చేసినపనే అది. దీనిపై ఆనాడు కొద్దిగా చర్చా జరిగి సరేకానీండి అని ఎక్కువమంది అంగీకరించబడడంతో మొదలైందే ఆ క్రమమైనా. ఇక్కడే ప్రకాష్‌గారు, పరిణామవాదం, ఉష్ణగతిక శాస్త్ర నియమాలకు విరుద్ధంగనుక, పరిణామవాదాన్నే సరిచేసుకోవాలి. ఎందుకంటే, సైన్స్‌ పద్ధతి ప్రకారం 'లాస్‌' మారవు, సిద్ధాంతాలు మారవచ్చు అని చెప్పారు. దానినే ప్రకాష్‌గారు, రాజేంద్రప్రసాద్‌గారికి వ్రాసిన లేఖలోనూ ప్రస్తావించి ఆనాటి నా ప్రతిపాదనను మీరుగానీ, సురేంద్రగానీ ఖండించలేకపోయారుకదా! అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ఇక్కడ నా పక్షమేమంటే, (1) నేను దానిని ఖండించడం, ఖండించకపోవడం అన్నదానినిబట్టి పరిణామవాదం ఒప్పనిగానీ, తప్పనిగానీ నిరా&ధరణకాదు. ప్రతిపాదకులే నిరూపించాల్సిన బాధ్యత స్వీకరించాలన్నది వాద నియమాలలో ముఖ్యమైనది. ఆ నిరూపణ కూడా ఆ విషయంలో విశేషజ్ఞుల సమక్షంలో చేయాల్సి వుంటుంది. అంటే 'ధర్మోడైనమిక్స్‌ నియమాలకు పరిణామవాద సూత్రాలు విరుద్ధమైనవి' అంటున్నవాళ్ళు, దానిని ఉష్ణగతిక శాస్త్రవేత్తలు విశ్వనిర్మాణ-పరిణామ-శాస్త్రవేత్తల ముందుపెట్టి, నిరూపించి వారిచేతగదా అంగీకరింపజేయాలి? ఎదుటివారి బలహీనత తనవాదపు సత్యతకు ఆధారం అనడం అతార్కికం. అలా చేయడం వాది బలాబలాలు పరీక్షించేటపుడు అనుసరించవచ్చుగాని, వాద బలపరీక్షలో వాడరాదు. జల్పవాదంలో అంటే ఎవరికెంత తెలుసు అని, తేల్చుకోవలసిన సందర్భానికి పనికివస్తుందది. ఈ సందర్భానికి చెందిన రెండు సూత్రాలను చెపుతాను చూడండి.
1. þ, (2) అప్రతిపత్తి ర్విప్రతిపత్తిశ్చ నిగ్రహస్థానమే.
1) ఒకని తెలియనితనాన్ని మరొక సిద్ధాంత నిర్ధారణకు ఆధారమనడం అహేతుకం,
2) అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనం వహించినా, వేరే అంశాన్నెత్తుకున్నా అతడు ఓడిపోయినట్లే. ఒక్కమాట మిత్రులారా! మా వేదిక విషయప్రధానమైందేగాని, ఎవరికెంత తెలుసో తేల్చుకోడానికి ఉద్దేశించిందికాదు. కనుక నేనుగానీ, వేదికలోని ఎవరుగానీ, బదులాడనంత మాత్రాన ప్రకాష్‌గారి వాదం సత్యమని నిర్ధారణైనట్లుకాదు. ప్రతిపాదించడమే నిరూపించడముకాదు. ప్రతిపాదించి, వాదన ద్వారా వెలిబుచ్చిన ప్రత్యంశానికీ రుజువులు చూపి, ఆ విషయాలు తెలిసినవారి ఆమోదముద్ర వేయించాలి. ప్రకాష్‌గారు ఈ నిర్ధారణ పద్ధతిని ఏమాత్రం పాటించకుండా, అరకొర జ్ఞానంతో, ముక్కున పట్టుకొచ్చిన నాలుగు మాటల్ని మాట్లాడి, మేమేదో తేల్చేశాం, మీరెవరూ, ఏమీ మాట్లాడటేకపోయారు అంటూ ఈ విషయాన్నే రెండు మూడుసార్లు వేలెత్తి చూపబోయారు.
గమనిక : దాని విషయమై నేను మాట్లాడకుండా ఊరుకోవడానికి వెనక నా లక్ష్యం నాకుంది. అదేమిటంటే (1) నేను ఒక పక్షాన్ని స్వీకరించలేదు. (2) పరిణామవాదం సరైందేనన్న పక్షాన్ని స్వీకరించినవాళ్ళు, సైన్స్‌ సమాచారంలో ఎంత సమకూర్చుకుని ఉన్నారో తెలుసుకోవాలన్న దృష్టి నాకుంది, (3) సైన్స్‌ సమాచారమే తమకు ముఖ్యమైన ఆధారం అంటుండే భౌతికవాద పక్షీయులు, నిరంతరం, ఎప్పటికప్పుడు వైజ్ఞానిక సమాచారాన్ని నిత్యనూతనంగా సమకూర్చుకుని వుంచుకోవాలి. అందుకు నిరంతరాధ్యయనం అవసరం. ఈ వాస్తవాన్ని వారి దృష్టికి రావాలంటే, సైన్స్‌నాధారం చేసుకునే, నాస్తిక వ్యతిరేకవాదాన్ని వినిపిస్తున్న ఆస్తికపక్షం వారిని, వారికి వారుగానే నిరోధించగలగాలి. పైగా మా వేదిక ఉద్దేశాన్ననుసరించి ఆ అవసరమూ వారికుంది. కనుకనే ప్రకాష్‌గారి లేదా ఇస్లాం బైబిల్‌పక్షాలవారు లేవనెత్తిన వాదనాంశాలపై స్పందించాల్సింది ప్రధానంగా నాస్తికపక్షంవారే. గనుక, ప్రకాష్‌గారు, వగైరాలు అంటున్న 'మా వాదనపై ఎవరూ ప్రతికూలత కనపరచలేదేమి?' అన్నదానికి వారే సమాధానం చెప్పాల్సివుంది. విచారణ సిద్ధాంత ప్రధానమైంది కనుకనూ, అందుకు ఏ పక్షాన్ని ఎవరైనా స్వీకరించవచ్చుగనుకనూ, ఇక్కడ నా పాత్ర నాకు తెలిసినమేర ఆస్థికులకూ, నాస్తికులకూ, వేదికకు కూడా సమాచారం అందించవచ్చు. అదీ నా ఇష్టాఇష్టాలకు లోబడే పైగా వారి వేదికలో చర్చలో పాల్గొనక అది ముందే చెప్పాను. ఇక్కడ నీవెందుకు మాట్లాడలేదు అనే హక్కు, వేదిక పద్ధతిననుసరించి ఎవరికీ లేదు. ఈ విధానం తెలియనితనంనీ లేదా, తెలిసీ మరుగుపరచేతనంగానీ ప్రకాష్‌గారితో వుండడంవల్లే సురేంద్ర మౌనంగా వున్నారేమిటి? ఒక ప్రశ్నయినా అడగలేకపోయాడేమీలాంటి పేలవమైన మాటలు మాట్లాడారు.
దీనికంటే ముఖ్యవిషయం ఏమిటంటే, ప్రకాష్‌గారే, 'పరిణామవాదాన్ని వీగిపోయిన సిద్ధాంతంగా చెప్పాలన్న ఉబలాటం మాకేమీ లేదన్న తరువాత, వారిపక్షం అదొక తప్పు సిద్ధాంతం అని అనడం లేదన్నది తేలిపోయినట్లేకదా! మా వేదిక క్రమాన్నిబట్టిగానీ, ఆస్థికపక్షం అంగీకరించినదాన్నిబట్టిగానీ, పరిణామవాదం ఒప్పుసిద్ధాంతమని తేలకపోవడంవల్ల వచ్చిపడే ప్రమాదంగానీ, ఒనగూడే ప్రయోజనంగానీ ఏమీలేదు. నాస్తికపక్షం మాత్రం తమ దృష్టిని కొంత మార్చుకోవలసి వుంది. అదేమంటే నిర్జీవం నుండి జీవం వచ్చిందన్నది ఇప్పటికీ ప్రయోగరీత్యా రుజువు కాలేదన్నది నిజం అని వారూ అంగీకరించి తీరాలి. దానర్థం నాస్తిక తప్పని తేలిందని అర్థంకానేకాదు. నాస్తికతే ఒప్పు అని తేలలేదని మాత్రమే ఈ నిజాన్ని నాస్తికులు కాదన్న ఆస్తికులు కాదన్నా వారు పద్ధతితప్పి మాట్లాడుతున్నారనే. మరోమాటా చెప్పుకుంటేగాని మా పాత్రకు న్యాయం చేసినట్లుకాదు. ఆస్తికపక్షంవాళ్ళు పరిణామవాదాన్ని తప్పని తేల్చలేకపోయారుగనుక నాస్తికం ఒప్పని తేలిందనిగానీ, ఆస్తికత తప్పని తేలిందనిగానీ అర్థం చెప్పకూడదు. ఈ మొత్తం విచారణకు నిస్పాక్షికంగా చూడడమంటే, నాస్తికులు పరిణామవాదాన్ని నిర్ధారిత వాస్తవంగా (రుజువైన సిద్ధాంతంగా) తేల్చలేకపోయారు, ఆస్తికులు అది వీగిపోయిన సిద్ధాంతంగా తేల్చలేకపోయారన్నదే ఇప్పటికీ వేదికలో తేలిన అంశం అని అంగీకరించడమే.
ఇదంతా ప్రకాష్‌గారికీ తెలుసు. ఆయనకు తెలుసనడానికి ఆయనన్న మాటలే గట్టి రుజువు - చూడండి :
1) మేము పరిణామవాదాన్ని వీగిపోయిన సిద్ధాంతం అనాలనుకోవడం లేదు (తప్పని చెప్పలేదు-తేల్చలేదుకూడా)
2) సిద్ధాంతమంటే హైపోథిసిస్‌కంటే పైస్థాయి, నిరూపిత వాస్తవంకంటే క్రిందిస్థాయి కలిగిందని, సైన్స్‌లో అదొక సిద్ధాంతం మాత్రమే. దానిని ఫ్యాక్టు (నిరూపిత వాస్తవం) అనకూడదు. వారి అర్థంలోనే.
3) నిరూపిత సత్యమంటున్న నాస్తికులకు ఆ మాట అనకండని చెప్పండి సురేంద్రగారూ.
4) పరిణామం విశ్వపరిణామం, జీవపరిణామం కొన్నిస్థాయిలలో, మేమూ జరుగుతున్నట్లు అంగీకరిస్తున్నాము.
5) మా వివాదమంతా నిర్జీవం నుండి జీవం దానంతటదే పుట్టిందనడానికిగానీ, ఒకజాతి నుండి మరోజాతి ఉద్భవిస్తుందనడానికిగానీ ఆధారాలు లేవన్నదే.
ఇప్పుడు జరిగిందాన్నంతటినీ (విషయపరంగానే క్రమాన్ని చూడాలన్నది గుర్తుంచుకోండి) సమీక్షిస్తాను చూడండి.
1) పరిణామవాదం తప్పనితేలితే సృష్టివాదం ఒప్పని తేలినట్లే లేదా పరిణామవాదం ఒప్పని తేలితే సృష్టివాదం తప్పని తేలినట్లే అన్న షరతును అంగీకరించి మొదలైంది వేదిక.
2) నాస్తికులు పరిణామవాదాన్ని రుజువైన సిద్ధాంతంగా తేల్చలేకపోయారు.
3) ఆస్తికుల్లో, ప్రకాష్‌, సుధాకర్‌గార్లు, కాకినాడ రెహ్మాన్‌గారు మొదటే అది కొంతమేర సరైందికానీ పూర్తిగా నిరూపిత వాస్తవంకాదు అంటూ వచ్చారు. తప్పని రుజువు చేస్తాం అన్న కడప గౌస్‌గారుగానీ, తారిఖ్‌గారుగానీ దానిని తప్పని రుజువు చేయలేకపోయారు.
4) వైజ్ఞానికంగా అదింకా థియరీ స్థాయిలోనే వుంది. జీవం సృష్టించబడలేదిప్పటికీ అని భార్గవగారు, నందికేశ్వరరావుగారూ సైంటిస్టులుగానూ, తాత్వికంగా నాస్తికులుగానూ తమ అభిప్రాయాన్ని చెప్పారు.
5) పరిణామవాదం సెకండ్‌ డిగ్రీ థియరీ అనే నేను మొదటినుండీ చెపుతూ వస్తున్నాను.
6) పరిణామవాదం శాస్త్రీయ సిద్ధాంతమేగాని, నిరూపిత వాస్తవంకాదని నాస్తికులకు చెప్పమని ప్రకాష్‌ నాకు సూచించారు.
యోచనాశీలురైన పాఠకమిత్రులారా! ఈ మొత్తం పరిణామవాద విషయంగా దేనిని తెలియజేస్తోంది.
(1) అది ఒక తేలిన వాస్తవంకాదు, (2) తప్పని తేలిందీకాదు, (3) సైన్స్‌లో సిద్ధాంతస్థాయి కలిగినవాదం.
మా రెండు వేదికల విచారణా ఇక్కడికే వచ్చి ఆగింది. మా వేదికనుండి, ఈ అంశంపై ఇప్పటికి విచారణ ముగిసిందని ఒక నిర్వాహకునిగా నేను ప్రకటించి, పరిణామవాదం తప్పనిగానీ, ఒప్పనిగానీ నిరూపించాల్సింది అణు జీవరసాయన శాస్త్రవేత్తలూ, వారి ప్రయోగాలు మాత్రమేనని ఆనాడే ప్రకటించాను. ఆనాటి వేదికలో ఉన్నవారంతా దానిని అంగీకరించారు. కనుకనే మా వేదికే క్రమాన్ననుసరించి కొనసాగింపు కార్యక్రమంగా సృష్టివాదాన్ని విచారణకు స్వీకరించాల్సి వుందన్న నిర్ణయానికి వచ్చింది. మా వేదికలో పరిణామవాదంపై చర్చ ఎక్కడకు వచ్చి ఆగిందన్న ప్రశ్నకు, ఇంతకంటే వేరే సమాధానం లేదు. నిజమిలా వుండగా ప్రకాష్‌గారు మళ్ళా పరిణామవాదం పై మీ రేమిటి? మీరేమిటి? అని సృష్టివాదం చెప్పరేమని అడిగిన వారినల్లా అడగడం అసందర్భం, అనుచితం, అయినా మళ్ళా మళ్ళా అదే మాట్లాడబోతే దానిని అడ్డగోలుతనమనే అనాలి. అదిగో నాకు అక్కడనుండి ఎదురవుతుంది. వేరే భాషలో వ్యక్తిని నిగ్గదీస్తూ మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అలా మాట్లాడడంలో విషయాన్ని విడిచివేయడం, వేరుదారి పట్టించాలనుకోడం అన్న దృష్టి చొరబడింది కనుక. దాంతో వ్యక్తి బలాబలాలు, లోపాలోపాలను విశ్లేషించడం తప్పనిసరై వాది పరీక్ష మొదలవుతుందన్నమాట.
ఇప్పుడిక రాజేంద్రప్రసాద్‌గారికి ప్రకాష్‌ వ్రాసిన లేఖ వైఖరిని విచారించాల్సి వుంది.
(1) రాజేంద్రప్రసాద్‌గారు క్రమాన్ననుసరించి సృష్టివాదాన్ని ప్రతిపాదించి నిరూపించండి అనేగదా ప్రకాష్‌గారినడిగింది. దీనికి ప్రకాష్‌గారు షాకైయ్యానన్నారెందుకని? అంతటితో ఆగక ఇంతకూ పరిణామవాదం ఇప్పటికీ మీరు తేలిన వాస్తవంగా అంగీకరిస్తున్నారా? అని మళ్ళా మొదటి పాటెందుకున్నారెందుకని? అక్కడతోనూ ఆగక అందింకా నిర్ధారించాల్సినస్థాయిలోనే వుందనేట్లయితే ఆమేరకైనా ఆధారాలు చూపమని అడిగారెందుకని? ఇదంతా రెడ్డొచ్చే మొదలాడమన్నట్లో, పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్లోనే వుందికదా! మా వేదిక తీర్మానం చేసింది నాస్తికులపక్షంనుండీ, ఆస్తికులపక్షంనుండీ, అన్వేషకుల పక్షంనుండీ, సైన్స్‌పక్షం నుండీ కూడా పరిణామవాదం తేలిందీకాదు, వీగిపోయిందీకాదు. పరిశోధనా క్షేత్రంలో ప్రయోగాల థలో వుంది అని. ఇక దాని విషయంలో మా వేదికలో పాల్గొన్నవారెవరూ ఒకరినొకర్ని ఆ విషయంలో ఇప్పటికి ప్రశ్నించుకునే అవసరం లేదు. అవకాశమూ లేదు. మా వేదికలో ఒక పక్షానికి ప్రతినిధైన ఎవరుగానీ (ప్రకాష్‌గార్లూ) దానికి కట్టుబడాల్సిందే. అతిక్రమించరాదు. మరో అంశం వేదిక విచారణ పరిధికి ఏమాత్రం సంబంధంలేని మండలి సిద్ధాంతాన్ని చెప్పమనడం, అది చెప్పకుంటే మమ్మల్ని అడిగే హక్కు సురేంద్రకు లేదనడం బొత్తిగా అడ్డగోలుతనం. ఆ వేదికలో, నేను నిర్వాహకుణ్ణి. విచారణీయాంశం పరిణామవాదమా? సృష్టివాదమా? ఏది సరైంది తేల్చుకోవడం. సరళంగా స్పష్టంగా వున్న దీనిని గందరగోళపరచడానికి అతను పడినపాట్లు చూస్తే మత సెబ్బరితనం వుందనిపిస్తోందాయనలో అన్నారు.
మరోవాదం లేవనెత్తారాయన! సురేంద్రనడుగుతుంటే ప్రసాద్‌ సమాధానం చెపుతాడేమిటండీ! ఇది హాస్యాస్పదంకాదా! అని వ్యంగ్యంగా మాట్లాడడం వెనక పద్ధతి తెలియనితనమే గాకుండా వెకిలితనంకూడా వుంది.
(1) దమ్ముంటే నీది చెప్పి నిరూపించుకో అనీ, (2) జబ్బలు మరోసారి చరుస్తున్నాను అనీ, (3) నీ లేఖ చూసి నవ్వుకున్నానంటే నమ్మండి అనీ నన్నదీ, (4) మీరూ అలానే మాట్లాడుతున్నారేమిటి? మీ లేకచూసి షాకైయ్యాను అని రాజేంద్రప్రసాద్‌గారిననీ, కోట ప్రసాద్‌ సమాధానం చెప్పడం హాస్యాస్పదం అనీ ప్రసాద్‌ననడం, అంతక్రితం జరిగిన సమావేశాలలోనూ ఇంత లోతైన విషయాలు మీరర్ధం చేసుకోరులే అని దూరతిశయంలో సభనుద్దేశించే అనడం, అదే సమావేశపు రోజు భోజనాలదగ్గర సభను తల్లకిందులు చేసేశాను, స్వరూపాన్నే మార్చేశానన్నట్లు వీరాలాపాలాడడం (మాలో కూర్చున్న 5, 6 సమావేశాల్లోనూ ఏదో సమయంలో తన గొప్పను ప్రదర్శించుకోవడం, ఎదుటివాళ్ళను హేళన చేస్తూ మాట్లాడడం, ఇవన్నీ ఆయనలోని పిల్లతనపు చేష్టనో, వెకిలితనాన్నో చూపెట్టేవిగనే వున్నాయి. మొన్నటికిమొన్న వారే సత్యోదయంలో నిర్వహించిన సదస్సులోనూ నాస్తికులను పరిణామవాదం సిద్ధాంతమేగాని, నిరూపిత వాస్తవంకాదని తెలిసింది గనుక ఇకనుండి వారిని, పరిణామ ఇసద్ధాంతం నిరూపిత వాస్తవమే, కనుక దేవుడు లేడు అని చెప్పవద్దని చెప్పండి. అలాగనుక వారు చెపుతున్నట్లయితే ప్రజల్ని మభ్యపెడుతున్నట్లే అని శ్రీరంగనీతిని బోధించి, ఆ వెంటనే మిత్రులారా కనుక సత్యంలోకి రండి, దేవునివైపు తిరగండి అనడం వెనక ఎంత అనైతికత, ఎంత కుటిలత వుందంటారు? ఏమాత్రం పద్ధతి తెలిసి వున్నా, నలుగురు నవ్విపోతారన్న జంకు ఉన్నా ఆ మాట అనగలిగేవారు కాదాయన.
వైజ్ఞానిక ప్రపంచమంతా శాస్త్రీయ పరికల్పనగా అంగీకరించి, సాంకేతికంగా ప్రయోగ సామర్థ్యాన్ని సంతరించుకున్నమేర, పరిణామవాద ప్రాథమిక సూత్రీకరణలకు లోబడి, అనేక ప్రయోగాలు చేస్తూ, ఆ ఫలితాలను సమాజానికీ అందిస్తూనూ, సాగుతున్న జీవరసాయన క్షేత్రంలోని సిద్ధాంతస్థాయి ప్రతిపాదనగా వున్నదానినే, అదింకా పూర్తిగా తేలిన అంశంకాదు. కనుక నాస్తికత్వమే సరైంది అనడం ప్రజల్ని ప్రలోభపెట్టడమే అని రాగాలు తీసారాయన, అస్సలు తన సృష్టివాదాన్ని ఈషణ్మాత్రం (నలుసంతైనా) సభముందుంచకనే, మరోవైపు ఇప్పట్లో ప్రతిపాదించము కూడా అనంటూనే, సత్యంలోకిరండి, దేవునివైపు తిరగండి అనడం మతిమాలిన లేదా, మతి చెఇనతనంకాదంటారా! సున్నితహృదయులూ, అంటీముట్టని రకము, నా వాగ్భాణాల పాలపడినవారూ మాట కఠినం అనే అంటున్నారుగానీ, మందిని తమకే తెలియని మార్గంవైపులాక్కెళ్ళి వృత్తిలో ఉన్నవారిని సంబోధించడానికి నిజంగా ఈ మాటా చాలా పేలవమైందే అవుతోంది.
ప్రకాష్‌గారి పోకడలోని ముఖ్యమైన తప్పుడుతనం, ఎవరైనా తనని అదేమిటంటే, ఇక అన్నింటినీ ప్రక్కనబెట్టి ఇంతకూ నీవెవరు? నీదేమిటి? నీది చెప్పకుండా, దానిని రుజువు చేయకుండా ఇతరులనడిగే హక్కు నీకెక్కడిది అంటూ దాడికి దిగి, అవతలివాడు ఇతనిలో మనకెందుకొచ్చిందిలే అనో, టైం వేస్టనో అనుకునేలా చేద్దాం అన్నదగ్గరుంది. మా వేదికలో పాల్గొన్న ఆస్తిక-నాస్తిక-పరిశీలక పక్షాలలోని ఎవరైనా తానేమిటో చెప్పకుండానే వేదిక క్రమాన్ననుసరించి మీరిలా చేయాలి, ఇప్పుడిలా చేయాలి అని సూచించవచ్చు. అంతేకాక, ఆస్తికపక్షంలోగాని, నాస్తికపక్షంలోగానీ పాల్గొన్న ఒకడు తాను తన అవగాహనమేర ప్రతిపాదించి సగంలో వాదించలేక ఆగినా, ఆ వేదిక ఎక్కడికిచేరి ఆగిందో గుర్తించడానికీ, అక్కడినుండి ఏమిచేయాలో సూచించడానికీ అభ్యంతరముండక్కర్లా. ఎందుకంటే వాద ప్రతివాదాల్లో పాల్గొనని పరిశీలకులూ, శ్రోతలు కూడా వేదిక ఎంతవరకు వచ్చిందో ఏమి నిర్ణయాలు చేసిందో సాక్ష్యం చెప్పడానికి ఆయా సిద్ధాంతాలను తానే ప్రతిపాదించి నిరూపించాల్సిన పనేముంది. అదుగో అక్కడ అడిగినవాడినల్లా నీ సిద్ధాంతమేమిటో నిరూపించాకే మాట్లాడమనే దగ్గర) వుంది ప్రకాష్‌గారి గతితప్పినరీతి.
ప్రకాష్‌గారండీ! ఇంతమందిని, ఇన్నిన్నిసార్లు, బహిరంగంగా, వ్రాతమూలకంగా (1) దమ్ముంటే తనది చెప్పి రుజువు చేసుకోవాలనీ, (2) తనదేమిటో ప్రకటించి దానిని సరైందేనని రుజువు చేయనంతకాలం ఒకనికి మరొకరిదాన్ని చెప్పమని అడిగే హక్కుండదనీ నిగ్గదీస్తూ వస్తున్న మీకు, ముందుగా మీరేమిటో చెప్పి దానిని సరైందేనని రుజువు చేసుకోకుండా ఇతరులనడిగే హక్కు మీకూ వుండదని గుర్తుకురావడంలేదా? దమ్ముండడమంటే తనది చెప్పి నిరూపించడమే అన్న మీకు, మీ దమ్ము సంగతి గుర్తుకు రావడంలేదా? జబ్బచరచడమంటే నాదిదిగో అనడమనా? మీదేమిటో చూపించుకో అనడమనా? గొప్ప వాదనా పద్ధతేమీది? అబ్బో! చాలా దమ్ముకనపడుతోంది మీలో.
భార్గవగారు సమావేశానికి రాకపోవడాన్ని (1) మీ ప్రయత్నలోపం, (2) ఆయన పనులవత్తిడి అన్న రెండు కారణాలనుగానీ, ఏదో ఒక కారణాన్నిగాని తీసుకుని)  సహృదయంతో అర్థం చేసుకోడమో, సహనంతోబఠించడమో చేయాల్సిందిపోయి; మర్యాద విడచి అదేదో పీకకోసేసుకోవాలన్నంత తప్పిదమన్నట్లు మాట్లాడిన మీరు (మీపక్షాన సుధాకర్‌) ఇంతలేసి వైరుధ్యాలతో, అడ్డగోలుగా, పద్ధతితప్పి మాట్లాడినందుకూ, ఆ తప్పుడుతనం బహిరంగమైనందుకు ఇదిగో ఇప్పుడనుకో వారి పీక కోసుకోవాల్సిన పరిస్థితి మీకు దాపురించిందని.
''సిగ్గుపడే లక్షణం వుండడం, పారిపోయే లక్షణం లేకుండడం సత్పురుషుల గుణాలని భారతీయ తాత్వికులంటారు. ఈ విషయంలో మనమేమిటో ఎవరకు వారం ఆత్మవిమర్శ చేసుకోవలసి వుంది. మళ్ళా చెపుతున్నాను. మా, మీ వేదికల ముగింపు; పరిణామవాదం పూర్తిగా రుజువైనదనడానికి వీల్లేనిది, తప్పని తేలిందీకాదు. వైజ్ఞానిక లోకమూ శాస్త్రీయంగా పరిశోధించాల్సిందిగానే తలంచబడుతూ, ప్రయోగాలకు లోనుచేయబడుతూ, కొంతమేర సత్ఫలితాలనూ ఇస్తున్న సిద్ధాంతమది అన్నదే. కనుక ఇక దాని విషయమై ఈ వేదికలు ఇప్పట్లో తేల్చవలసిందీ, తేల్చగలిగిందీ ఏమీలేదు.
కనుక, క్రమానన్ననుసరించి సృష్టివాద సాధారణ రూపాన్ని, ఆయా ఆస్థికపక్షాలు తమదైన సృష్టివాదాన్ని (విశేషరూపాన్ని) ప్రతిపాదించి నిరూపించడమన్నదే చేయాల్సిన పనిగా వుంది. ఆ లెక్కన మీరు బైబిల్‌ సృష్టివాదాన్ని ప్రకటించి నిరూపించాలి.
అలాగే మనమధ్య సి.టి.ఎఫ్‌. పేరన మీరు లేవనెత్తిన వివాదకారణంగా సి.టి.ఎఫ్‌. సభ్యుల వివరాలు మాకందించాల్సి వుంది. తప్పులు సవరించుకునే నైజం ఎంతో కొంత మీలో మిగిలి వుంటే, ఇప్పటికైనా, మీది చెప్పమని, అడిగినవాణ్ణల్లా అదరగండంగా, ముందు నీదేదో చెప్పు అనంటూ మొదలెట్టడం ఆపేయండి. వేదిక క్రమానన్ననుసరించిగానీ, మీరే నియమంగా చెప్పినదాన్నిబట్టి దమ్ముంటే చేయాల్సిన, ఇతరులనడగడానికి ముందు చేయాల్సిన, మీ బైబిల్‌ సృష్టివాదాన్ని ప్రతిపాదించి నిరూపించండి. ఆ తరువాతే ఎవరినైనా అడగండి, జబ్బలు చరచండి. అప్పుడుకూడ ఈ వేదికను, వేదికలో పాల్గొన్నవాళ్ళను అడగాల్సింది ఏమీలేదు. ఎందుకంటే ఈ వేదిక దానికదే ఒక క్రమాన్ని అనుసరించాల్సి వుంది. అనుసరిస్తూనూ వుందికనుక. రాజేంద్రప్రసాద్‌గానీ, మరొక భౌతికవాద పక్షపు వ్యక్తిగానీ మా వేదికననుసరించి మీ ప్రశ్నలకు సమాధానం చెప్పక్కర్లా. ఎందుకని? (1) పరిణామవాదంపై వేదిక ఒక ముగింపును ప్రకటించింది కనుక. (2) వేదిక స్వభావం, విడివిడిగా ఆ వ్యక్తులకెంత తెలుసు అన్నది పరీక్షించడంకాదు గనుక. కాకుంటే ఎవరికి వారు వ్యక్తిగా వారివారి అభిలాష ననుసరించి మీతో మాట్లాడుకోవచ్చు. వాదనియమాలు, నిర్ధారణ నియమాలు తెలిసి వేదిక క్రమాన్ని పాటించడమంటే అంతేమరి.
వేదికకు సంబంధించినంతలో విషయం ఇంతే. అయినా సి.టి.ఎఫ్‌. పేరన నాతో వివాదానికి దిగారుగనుక. ఒక క్రైస్తవ విశ్వాసిగా స్వస్థత ప్రార్థనల యదార్థాలను నిరూపించాల్సిన బాధ్యతనుండి మీరు ఎట్టిపరిస్థితిలోనూ తప్పించుకోలేరు, పలాయనం చిత్తగిస్తేతప్ప.
''మీరు పద్ధతిననుసరించకుండా వుంటే, మీ మాటలుగా నా దగ్గరున్న వాటిని పత్రికలో క్రమంగా విశ్లేషిస్తూ వస్తాను'' అన్నందుకే, ఏమిటీ, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు? అనడిగారే! ఇదేమిటండీ! సురేంద్ర ఇలాగే వ్రాస్తుంటే చూస్తూ ఊరుకోము అనంటున్నారు? ఒకవేళ ''ఇది'' పొరుగువానిని నీవలే ప్రేమించుము''కి ఆచరణ రూపం కామోసు. కాదంటే, ''నన్నంగీకరించనివాడు జనంనుండి కొట్టివేయబడాలి'' అన్న యెహోవా పద్ధతికి చెందిందైనా అయ్యుండాలి. మీ మాటల వెనక భావమేమిటో వివరం మీరేచెప్పాలిమరి.
వ్యక్తిగత విమర్శనాపి, విషయం దగ్గరకు రమ్మంటే సురేంద్ర రావడంలేదన్నది మీ ఆరోపణ. ఇది పచ్చి అబద్ధం. విషయాన్ని ప్రక్కదారిపట్టించి వేరు విషయాలను ప్రస్తావించి అటువైపు నడవమంటున్నారు మీరు. దాంతో నేను మళ్ళా మిమ్మల్ని అసలు విషయం దగ్గరకు బలవంతంగానూనా  నెట్టుకురావడానికే మీ వైఖరిలోని లోపాన్ని, దోషాన్ని కూడా ఎత్తిచూపించే పనిచేశారు; చేస్తున్నాను. ఆ మాటే నా రాతల్లో రాశానుకూడా.
ప్రస్తుతం మనమధ్య సిద్ధాంత విషయ విచారణ ఆగింది. వాది-వ్యక్తి వ్యక్తిత్వం, పద్ధతి అన్నవాటి విచారణ మొదలైంది అని చెప్పాను. మళ్ళా మనమధ్య విషయ విచారణ మొదలవ్వాలంటే వేదిక క్రమాన్ననుసరించి మీరు మీదైన సృష్టివాదాన్ని ప్రతిపాదించి నిరూపించడానికి సిద్ధంకావాలి, వాస్తవమిదే. మీరు ఇక్కడకు వస్తే మళ్ళా అవసరపడేంతవరకు వ్యక్తివిమర్శ జోలికి నేరుగా పోరు.
వివేక్‌ ఫౌండేషన్‌ ఇ-మెయిల్‌పై ప్రతిస్పందన :
వివేక్‌ ఫౌండేషన్‌, పేరున అనేక ఇ-మెయిల్స్‌ అందుతున్నాయినాకు. ఆ ఇ-మెయిల్‌ చివరన సి.టి.ఎఫ్‌. అనీ వుంటోంది. ఇంతకూ సి.టి.ఎఫ్‌. తరఫున ఈమెయిల్స్‌ పంపుతున్నది ఎవరండీ! అని గత సంచికలోనూ ప్రశ్నించాను. నేను మొదటినుండీ అడుగుతున్న సి.టి.ఎఫ్‌. స్యుల వివరాలివ్వండి అన్నదానికీ, మీరెవరండీ అని అడిగిందాన్ని ప్రక్కనబెట్టి మళ్ళా వారే ఒక ఇ-మెయిల్‌ పంపారు. అందులో...
1) తెలివిగలవారు అసలు విషయాన్ని విడచి, అన్యవిషయాలకు ప్రాధాన్యతనివ్వరు.
2) ఇప్పటికే మీరు సి.టి.ఎఫ్‌.లోని ముఖ్యుల జాబితా పొందివున్నారు.
3) మార్చి సత్యోదయంలో జరిగిన సమావేశంలోనూ మీరు సి.టి.ఎఫ్‌. ముఖ్యుల్ని నేరుగా చూసివున్నారు.
4) ప్రకాష్‌ సి.టి.ఎఫ్‌.కు అధికార ప్రతినిధి అన్నది వంథాతం నిజం.
5) ఏమైనా మాట్లాడదలచుకుంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పండిముందు. లేకుంటే మౌనంగా వుండడం మంచిది. అది మీకే క్షేమం.
6) సృష్టివాదాన్ని ప్రకటించమని అడుగుతున్నారు. మా కార్యక్రమాలలోకెల్లా మాకున్న పెద్దపని అదే. దీనిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక సెమినార్లు జరిగాయి. అదొక నిరంతరాయమైన ప్రక్రియ. దానిపై 2009 ఫిబ్రవరిలో ఒక సమావేశం పెట్టనున్నాము. జనవరి 27న చెన్నైలో జాతీయస్థాయి సెమినార్‌ జరగనుంది. సృష్టివాదాన్ని చెప్పడానికి మేమేమీ భయపడడంలేదు.
7) మీరుగనుక మా సమావేశాలకు రాదలచుకుంటే ముందుగా మీ జ్ఞానసిద్ధాంతాన్ని ప్రకటించాల్సి వుంటుంది. ఇదొక్కటే మాకు నియమం. మీ జ్ఞానసిద్ధాంతం నిరూపణకు నిలిచేదన్న నమ్మకం మీకుంటే, అది చెప్పడానికి  ఆందోళన చెందక్కర్లేదుకదా!
8) మేము అంతర్జాతీయంగా నిరూపణైన జ్ఞానసిద్ధాంతంపై నిలచివున్నాము. అదిప్పటికే పలుమార్లు నిరూపణైంది. దానిని చెప్పడానికి మీకేమీ అభ్యంతరంలేదు.
9) మీ జ్ఞానసిద్ధాంతాన్ని రేపటి జనవరి, పిబ్రవరి నెలల్లో ప్రకటించబోతున్నాము. ఆమోదం పొందిన వారికి మాత్రమే అందులో ప్రవేశం వుంటుంది.
సురేంద్ర : ఇవండీ ఆ ఇ-మెయిల్‌ లేఖ సారాంశం - దానిపై నా స్పందనేమంటే -
1) ఇంతకూ మీరెవరండీ! మీ వివరాలివ్వండి అని లోగడ అడిగినా బదులాడక మళ్ళా ఇదంతా వ్రాశారేమిటి?
2) సభ్యుల జాబితా ఇంతవరకు నాకు చేరలేదని క్రిందటి సంచికల్లో వ్రాస్తూనే వున్నా, జాబితా మేము పంపదలచుకోకనే పంపలేదని ప్రకాష్‌ చెప్పివున్నా, వాటిని విడచి సభ్యుల వివరాలు నా దగ్గర వున్నాయనంటారేమిటి?
3) ప్రకాష్‌ అధికార ప్రతినిధి అని అంగీకరించాక సి.టి.ఎఫ్‌. తరఫున అతడేగదా స్పందించాలి? మరి మీరెవరు?
4) మిగిలిన విషయాలు నాకు, మా వేదికకు చెందినంతలో అప్రస్తుతం, అసందర్భంకూడా. ఎందుకనో ఈ సంచికలో నే కొన్ని వివరాలిచ్చాను. చూడగలిగితే చూడండి.
5) జ్ఞానసిద్ధాంతంపైన ఎవరిది సరైంది? అన్నది చర్చనీయాంశంగా వేదిక ఏర్పడితే, అక్కడ ఆ విషయాలు మాట్లాడుకోవాలి. అదీ, ఆ వేదికలో పాల్గొనడానికి సిద్ధపడిన వారు చేసుకోవలసిందే. దాన్లో పాల్గొనడం, పాల్గొనకపోవడం అన్నది వారి వారి స్వేచ్ఛకు-ఇష్టాయిష్టాలకు-సంబంధించిన అంశం.
6) మా వేదికలో పాల్గొన్న ఎవరుగానీ, మీరనే సి.టి.ఎఫ్‌గానీ, వేరెవరుగానీ, వేదిక క్రమాన్ని అనుసరించి తీరాలి. అది వదిలి మరో వేదికలో మాట్లాడబోతున్నాం, లోగడ ఎందరో మాట్లాడారులాంటివన్న అడ్డగోలు వాదనలు, తెలివిగా తప్పించుకునే ఎత్తుగడలో మాత్రమే. ఈ విషయంలో ఎవరో ఏదో, ఎక్కడో చేశారన్నది మాకనవసరం. మా వేదికలో పాల్గొన్నవాళ్ళు వాళ్ళ వాదమేమిటో ప్రతిపాదించి నిరూపించడమొక్కటే సరైనది. అదే సక్రమం. ఇది చేసుకోలేనంత క్లిష్టమైందేమీకాదు. మీరు దానిని పట్టించుకోవడంలేదంతే.
చివరిగా! మీ సృష్టివాదం ప్రకటించండి, మీ సి.టి.ఎఫ్‌. సభ్యుల వివరాలు ఇవ్వండి. అందులోనూ ఎవరెవరు ప్రకాష్‌గారు లేవనెత్తిన 13 అంశాలతో ఏమేరకు బాధ్యతవహిస్తారో మాకు తెలియాలి. రుజుత్వం వుంటే ఈ పని చేయండి మీరు.

No comments:

Post a Comment