మేలుకొలుపు
ఉత్తిష్ఠత! జాగ్రత! ప్రాప్యవరాన్ని బోధత!
మేలుకొలుపు
అవసరం!? మేలుకోవలసిన అవసరం!?
అమానుషమూ, పశుప్రవృత్తికి ప్రత్యక్ష తార్కాణమూనైన
సంఘటన ద్వారా దుష్టశక్తి మన కళ్ళముందే మరోసారి వీరవిహారం చేసింది. సమాజంలో,
వ్యక్తుల దృక్పధాల్లో తగిన మార్పు రాకుంటే యిలాటి సంఘటనలు సాధారణమై
సాధారణ వ్యక్తికి నిత్యానుభవ సంఘటనలుగా రూపొందుట నిశ్చయము. ఆట్టిస్థితే ఏర్పడితే
అధర్మ ప్రతిఘటనోద్యమానికి ఆయువు మూడినట్లే. ఎందుకంటే ఏ ఉద్యమానికైనా భౌతికశక్తిగా
రూపొందవలసి యున్న ప్రజానీకంలో ఉదాసీనత చోటు చేసుకుంటుది కనుక. ఇది భవిష్యత్తులో
సంఘ శ్రేయస్సునాకాంక్షించే వారల ఎదుటనున్న, ఎదురవనున్న మౌళిక సమస్య.
పోతే బలి అయింది. ఏవర్గం వారు అన్న
దృష్టి నుండి ఈ సంఘటన ఆయావర్గాల వారిచే స్వీకరించబడి తదనుగుణంగా, అన్యాయం జరిగిపోయింది ప్రతీకారం
తీర్చుకోవాలి యనో, తగిన శాస్తి జరిగింది పీడ విరగడైందంటూనో
వ్యాఖ్యానాలు, ఉద్రేకాలు, విసుర్లూ
ప్రారంభింపబడతాయి. సంఘటనకు అనుకూలవర్గాలు సంబరాలు చేసుకొనడం, మధ్యస్తులు (ఉదాసీనులు), పట్టనట్లుండడమో (ఈవర్గం
వారికి సమాజంలో జరగకూడనిది, మానవసంఘం అంగీకరించరానిది అయిన
సంఘటన జరిగింది అన్న సృహ కూడా ఉండదు ఆశ్చర్యము కదా!) ప్రతి కూలవర్గాలు (బలైనవారి
అనుయాయులూ, సానుభూతి పరులు) ప్రతిక్రియకై మరో విధ్వంసకాండకు ప్రణాళికల
నేర్పరచుకుంటుండడమో? యిప్పటికే ప్రారంభించబడి ఉండవచ్చు.
ఈమూడు వర్గాలుకాక సంఘ విద్రోహశక్తులూ, అవకాశవాదులూ దోపిడీలకూ,
విధ్వంసానికి పూనుకోవడం పరిపాటిగాకూడా అయిందన్నది మనందరి అనుభవంలోని
సంగతే.
అయితే పై నాలుగు విధములైన సంఘాల
వ్యక్తులలోనూ మౌలికంగా ఒకేధృక్పధం ఉందన్నదే అసలు గమనించ వలసిన సమస్య. ఏవరేమైతేనేమీ? మనమూ, మన
స్వార్ధపూరిత ఎదుగుదలా, అధికారమూ భద్రంగా ఉంటే చాలునన్నదే
ఆదృక్పధం. ఎందుకలా యనగలిగానంటే, బలైపోయిన వర్గం తమనష్టాన్ని
పూడ్చుకోవడానికి ఎంచుకుంటున్న మార్గం ఏదోక రూపంలో మరొక వర్గాన్ని బలిచేయుటయే. పైకి
ఎంతమంది నాయకులు (దాదాపు అన్ని వర్గాలవారు) ప్రశాంతంగా ఉండండి ప్రతిక్రియాత్మక
చర్యలూ, విద్వంసకాండా విడనాడండి అని చెపుతున్నా జరిగేది
మాత్రం మరో పాశవిక కార్యక్రమానికి నాందీవాచకమే. ఎందుకిలా జరుగుతోంది?
ససుగ్ర
దృష్టి నుండి చెప్పాలంటే. 1. వివేకం లోపించడం 2. సంఘ శ్రేయోదాయ కులం అన్న
ముసుగు వెనుక (ప్రస్తుతం వారే వర్గంలో ఉంటున్నా) స్వార్ధపరత్వమే అధికారం
చెలాయించడం 3. మానవత్వం మంటగలిసిపోయి ఉండడం 4. ప్రజలు అజ్ఞానులు, ఉద్రేక పరులూనై యుండడం ఇవన్నీ
కలివిడిగా, ముడిపడి అటవిక-జంతు-న్యాయం వాస్తవంగా అమలులో
ఉంది. గనుక ఈ విషయం యింత విపులంగా తెలియకపోయినా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలలోను ఈ
భావన కనీసస్థాయిలోనైనా ఉంది. కనుకనే ఎవరికివారు మనకెందుకు లేయన్న - అభిప్రాయానికి
వస్తున్నారు. సామాజిక మంచి చెడులతోను, వాటివలన ఏర్పడు స్థితులతోనూ
ప్రతి వ్యక్తీ ముడిపడి ఉన్నాడన్న ఉపజ్ఞత నేడు లుప్తమై ఉంది.
ఎవరినే మనగలం? ఒక వేళ అన్నా అన్నంత మాత్రాన
ఒరిగేదేముంది? వ్యవస్థ మారాలి అది వ్యక్తి దృక్పథం మారడం
అన్న మౌలిక ప్రాతిపదికపై నాధారపడి ఉందన్న వాస్తవం అందరూ గమనించడమూ, నిజాయితీగాను, నిక్కచ్చిగాను ఆత్మ సంస్కరణకై
యత్నించడమూ చేయాలి. మిగిలిన ప్రక్రియలన్నీ తాత్కాలికమే. ప్రస్తుత వికృతరూపం ఏ
కొందరి వల్లనో, కొద్దికాలంలో ఏర్పడింది కాదు. వాస్తవంగా
బహుకాలం, భిన్న వర్గాల అజ్ఞాన జనిత స్వార్ధ పూరిత, కుటిలయత్నాల ఫలమిది. రోగం దీర్ఘ కాలికమైనదై సామాజిక శరీర జీవ నాడుల్లోకి
సైతం వ్యాపించి ఉంది. దీనికి కాయకల్ప చికిత్స జరుగవలసియుంది. అనగా సమాజంలోని ప్రతి
భాగమూ సంస్కరింవబడాలన్నమాట. మేలుకొలుపు పిలుపు :- ఓ మేధావులారా! స్వార్ధాన్ని అప్రధానం
చేసుకొండి. మేల్కోండి, మేలుకొలపండి. పిలుపివ్వండి. దృఢమైన, నిత్యాభ్యాస
రూపమైనకార్యక్రమాన్ని ఇంటింటికీ, వ్యక్తి వ్యక్తికీ
అందివ్వడం ద్వారా మాత్రమే పై కాయకల్ప చికిత్స జరుగుతుంది. నాది గొప్ప, నేను గొప్పయన్న భావన విడువండి. బ్రతికినన్నాళ్ళు బ్రతుకబోమన్న వాస్తవాన్ని
గమనించండి. పశువులు పాశవికంగా ఉండడం అసాధారణం కాదు. మనిషి. పాశవికంగా ఉండడమే
అసాధారణమూ, అసహజమూను. అది నిజంగా పశుత్వం కంటే క్రింది
స్థాయి వ్యవహారం కూడా. జరిగిన దానిని గూర్చి విచారిస్తూనో, మూర్ఖంగా
సంబరపడుతునో (అది పైశాచికం కూడా) కాలం గడపక సరైనమార్పుకై యత్నారంభం చేయండి. అన్ని
వర్గాలలోని మంచివాళ్ళంతా కలవడమొక్కటే నేడు-ఏనాడైనా దుష్ట శక్తుల నణచడానికి ఉపాయం.
ఆలోచించండి! ఆలోచింపజేయండి. కదలండి, కదిలించండి.
వ్యక్తి
నిర్మాణమే సకల సమస్యలకు పరిష్కారం కాగలదు. ఉత్తిష్టత! జాగ్రత! ప్రాప్యవరాన్ని బోధత.
మేలుకొలుపు
పిలుపందుకోండి! మిమ్ము మీరు సంస్కరించుకోండి. మనలను మనమే సరిచేసుకుందాం రండి.
ఉంటాను సెలవ్
......
నమస్సులతో సత్యాన్వేషణలో
సురేంద్ర
ఆరోగ్యమూ - ఒక పరిశీలన
సంపుటి – 1 సంచిక - 3 15.5.910
ఆర్యులారా !
మానవ జీవితాన్ని లోతుగా అవలోకించిన
మేధావులెందరో ఈ జీవితం అనేక కోణముల నుండి అధ్యయనం చేయ దగినదిగానూ, చేయవలసినదిగానూ గమనించారు. అట్టి విశ్లేషణల
నుండి ఉద్భవించినవే శాఖోపశాఖలుగ నున్న ఆస్థిక, నాస్థిక
పోకడలన్నియూ. ఇప్పటికీ, సరికొత్తవీ, పాత
క్రొత్తల మేలు కలయిక నుండి ఏర్పడినవీ అయిన ధృక్పథాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఆయా
దృష్టులకు సమగ్రత ఉన్నా లేక పోయినా కనీస వేదిక (సంఘ శ్రేయో దృష్టి) మాత్రం ఉన్నదనే
యనుకోవాలి. అట్లనక పోయిన అవి అద్యంతమూ లోపభూయిష్టాలన్నట్లవుతుంది. అది యంత
తులనాత్మక దృష్టి యనుకోను. మా పరిశీలనలో గమనింపబడినంత వరకు ప్రతి సిద్ధాంత
రూపములోనూ ఎంతో కొంత అనుసరణీయత కొంత అసమగ్రత, కదాచిత్ లోపమూ
కనబడుతూ వచ్చాయి. సమాజంలోని ఆయా పోకడల అధ్యయనం వల్లనూ, స్వీయ
జీవితానుభవ విశ్లేషణల నుండి జనించిన యవగాహన వల్లనూ కొన్ని సార్వత్రికాంశములు
గమనింపబడ్డవి. అట్టివే ఒక క్రమంలో ఒక్కొక్కటిగా మీముందుంచే యత్నం చేస్తున్నాను.
సమీచీనమూ, హితకారకమూ, సత్యమూనైన యంశములు
ఎటు నుండి వచ్చినా అవశ్యం సమాదరణీయమే నన్నది మీరందరున్నూ ఎరిగిన విషయమే
ననుకొందును. మా కందిన సమాచారాన్ని బట్టి మేమెరిగిన సాధుమూర్తులలో వివేకపరంగా మీకూ
సముచిత స్థానం మా మనస్సులో ఉండుట వల్లనూ, సమాజంలోకి కదలాలి,
మేధావులను కదిలించాలి అన్న సదుద్దేశంలో భాగంగానూ ఈ లేఖా సముదాయాన్ని
క్రమంగా మీ కందజేస్తున్నాను. ఇందుపై మీరందరూ సముచితంగానే స్పందించగలరని
భావిస్తాను.
బ్రాహ్మీకర్మ
(తాత్విక జీవిత అధ్యయనాధ్యాపనములు) స్వధర్మంగా విధిగా స్వీకరించిన వారెల్లరి
యాశయమూ, ఆదర్శమూ
లోకహితమనుట నిర్వివాదము. అయితే ఇచ్చట లోకహిత మనునదేమి? అదెట్లు
సిద్ధిస్తుంది? అన్న యంశాన్ని నిశితంగానూ, ఆచరణాత్మకంగానూ పరిశీలించి నిర్ణయించుకోవాలి. అటు వంటి పరిశీలనాంశాన్నే నా
దృష్టి కోణం నుండి మీ ముందుంచే యత్నం చేస్తాను పరిశీలించండి. Note:-పరికరంలేని పనియన్నది మన యనుభవంలో లేదు. ప్రతి పనికి ఏదో ఒక పరికరం
తప్పని సరి. ఒక సాధ్యాన్ని పొందుటకై యత్నించునప్పుడు సాధనంగా పరికరాన్ని, పద్ధతిని కూడా కలిపి స్వీకరించాలి (అసాధారణ కారణం కరణమవుతుంది. అది
పరికరానికీ పద్ధతికీ వర్తిస్తుంది)
పరిణామ శీలమైన ప్రకృతిలోని సమస్తమూ
క్రియావంతమై యున్నప్పటికీ చేతన పదార్ధము నందలి జ్ఞాన వైశిష్ఠ్యము వల్ల యిచ్ఛ
ఏర్పడి తత్సిద్దికై ప్రయత్న రూపకర్మ ఏర్పడింది. ఇచ్చ సర్వమానవాళి కిన్నీ దుఃఖ
వియోగమూ, ఆనంద
ప్రాప్తి నుద్దేశించియే ఉంటున్నది. అలాగే
అర్ధ కామములు ఆనంద ప్రాప్తికి అధార భూతములనునది యందరకూ అనుభవములోని విషయమే.
అందువల్లనే ప్రతి వారూ వారి వారి జ్ఞాన క్రియాశక్తుల సామర్థ్యము ననుసరించి
అర్థకామముల పొందయత్నించుచున్నారు . జీవితాన్ని (దాని స్వరూప స్వభావాలను) సమగ్రంగా
బోధపరచుకున్న తాత్వికులు, బుషులున్నూ పురుషార్ధములను పేర అర్ధకామముల నంగీకరించియే
యున్నారు. వారంగీకరించినా రనియేగాక, అది యందరి యనుభవంతో నున్న విషయం కూడా. కాకుంటే కామముల యందలి
వైవిధ్యమూ, దానిని సాధించు వనరుల-అర్ధము-యందలి వైవిధ్యమూ
బహుగా గోచరిస్తున్నది. అంత మాత్రమే తేడా.
అయితే యిక్కడే సామాన్యులా, మేధావులా దృష్టులందు చాల వ్యత్యాసము కానుపించుచున్నది.
పై మూటినీ [1. దుఃఖ వియోగమూ, ఆనంద
ప్రాప్తి, 2. అర్థమూ, 3. కామము) సామాన్యులు యధేచ్చగా సాధించుకొన యత్నించు చుండ మేధావులు వాటిని
సాధించుకొనుటకు పూర్వమే నీవు సాధించదగినది మరొకటి కలదనియూ, అది
సాధింపబడి తద్వారా మిగిలినవి సాధింపబడినగానీ సమాజమునకు (వ్యష్టికీ, సమష్టికి) భద్రత ఉండదనీ బోధించినారు. ధర్మమనునదే వారు ముందుగా సాధించదగినదిగా
సూచించినది. ఇది ప్రధమ పురుషార్ధము. దీని విషయమై ఏ సంప్రదాయస్తుల మధ్యనూ భిన్న దృష్టి
లేదు. నాస్తికులు దానిని సామాజిక సంబంధాల పేరిట అంగీకరిస్తే, ఆస్తికులు కర్మ సిద్ధాంతం పేరిట స్వీకరిస్తారు. ఎవరెవరేయే కోణం నుండి
చెప్పినా ధర్మం [చేయవలసింది చేయవలసినంతా చేయట, తీసికొనవలసింది
తీసికొనవసినంతే తీసికొనుట అన్నదే ధర్మ స్వరూపం] అనవసరమని సూత్రం ఎవరూ చెప్పరు.
చెప్పలేరు కూడా. ఆస్తికులందలి అజ్ఞాతవాదాన్ని చెపే వారు (సృష్టి ఏర్పడలేదు అనే పక్షంవారు)
కూడా వ్యవహారిక సత్తా అంటూ, ఒక భూమికను ఏర్పాటు చేసి ధర్మాన్ని అంగీకరిస్తారు. వేదం
కూడా విథినిషేదాత్మక మైనదే. ఆస్తిక సంప్రదాయ మందలి అవతార ప్రసక్తిన్నీ ధర్మరక్షణకుగా
నేర్పడినదిగానే చెప్పబడింది. కనుక ధర్మమన్న పేరున చెప్పబడుతున్న కర్మ (వ్యక్తి
చేయదగినవి, చేయకూడనివి, పొందదగినవీ,
పొందకూదనివి అన్నవి) అందరకూ వారి వారికి తగిన రీతిని అవశ్యమూ సమాదరణీయమై
యున్నది.
పనికి పరికరం ఉండడం సార్వత్రిక నియమం
అనుకున్నాముకదా! కనుక ధర్మ కర్మకున్నూ తగిన సాధనం ఉండి తీరాలి. దీనిని గమనించే పెద్దలు
“శారీరమాద్యం ఖలు ధర్మ సాధనమ్” అని సూత్రీకరించినారు. మన యనుభవంలో కూడా అభీష్ట
సిద్ధికి వలయు యత్నం (ధర్మాధర్మ రూపాలలో నైనా) ఈ శరీరం ద్వారానే చేయబడుతుంది. కనుక
అన్ని పురుషార్ధముల సాధనకూ, భోగానికిన్నీ ఆలంబనమైన ధర్మ కాయాన్ని సాధించు కొనడం ప్రస్తుతమూ, ప్రాథమికమూనని నిర్ధారణౌతున్నది. ఇది మూడు స్థాయిలలో సాధింపబడవలసియుంది. 1. భౌతికం-స్థూల దేహం, 2. మానసికం సూక్ష్మ దేహం. ఇది
ఇచ్ఛాశక్తి రూపంలో ఉంటుంది. 3. బౌద్ధికం. [విచక్షణా జ్ఞానం
దీని రూపం]. దీనినే కారణ దేహం అంటారు. వీటినే వెనకటి వాళ్ళు దేహ త్రయంగా
పేర్కొన్నారు.
ఈ మూడు శరీరాలనూ ప్రస్తుతమున్న తీరునండి
ఉండవలసిన తీరుకు సరిచేసినగాని సక్రమంగానూ, సమగ్రంగానూ పురుషార్ధ సిద్ధికి ఉపయోగింపబడ
జాలవు. అంతిమ పురుషార్ధ సిద్ధికై వ్యక్తిని సమర్థుణ్ణి, అధికారినీ
చేయగలిగిందిది ఒక్కటే. దురదృష్టవశాత్తూ నేడు సమాజం ఈ కాయత్రయం విషయంలోనే అలసత్వం
కలిగి ఉంది. అందుకనే- సమ్యక్కాయం లేమిచేతనే- సమాజం నేడు అనూహ్యమైన రీతిని
ఒడిదుడుకులకూ, వత్తిడులకూ, భద్రతా రాహిత్యానికి, హింసకూ
లోనవుతున్నది. మొట్టమొదట మేధావులందరూ గుర్తించవలసిన అందరచే గమనింపజేయవలసిన అంశం
యిదే. దీనికి పిదపనే వారి వారి సాంప్రదాయాలకు చెందిన మరే అంశమైనా ప్రాముఖ్యత కలిగి
ఉంటుంది. ఉండాలి కూడా.
ప్రస్తుతం మార్గోపదేశకులూ, మేధావులునైన ఆయా సంస్థల వారందరూ కలసి ఈ
విషయమై ప్రణాళికాబద్ధమైన బృహత్కార్యక్రమాన్నేర్పరచుకుని కలసిగానీ లేక ఎవరికి
వారుగాగాని అమలు పరచవలసి ఉంది. స్థూల దేహమును గూర్చి నేననుకున్న ప్రణాళికా క్రమం
మీ ముదుంచుతాను. వివేచించండి.
1. శరీరాన్ని ఆరోగ్యవంతమూ, శక్తివంతమూ చేయుట. ఇది ఎలా?
అనారోగ్య కారణాన్నెరిగి దాన్ని తొలగిస్తే
ఉండేది ఆరోగ్యమే. అనారోగ్య మనగా శరీరం ఉండకూడని స్థితి. (అస్వస్థత). అవి 1. యివ్వవలసిన అహారమునివ్వక పోవుట 2. దృష్టాహారము నిచ్చుట, 3. శరీర గత మాలిన్యములను (వ్యర్థ
పదార్థములను) విసర్జింపక పోవుట అన్న కారణాల వల్లనూ, మరొక వంక
1. చేయవలసిన పనులు చేయక పోవుట, 2.
చేయకూడని పనులు చేయుట అన్న కారణాల వల్లనూ (ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే
యుక్తాహార విహారాదులు లేకుండుట వలన) ఏర్పడుతున్నది అస్వస్థతా నివారణోపాయములుగ మొదట
1. దుష్టాహారము నివ్వకుండుట 2.
హితాహారమును మితముగ నొసంగుట 3. శరీర గత బహిష్కరణావయవము లను
శక్తివంతము చేసి మాలిన్యములను తొలగించుట యను ప్రక్రియలచే సరిచేయబడవలసి యున్నది.
మరో కోణం నుండి విహారమును కూడా సరిచేసికొనిన గానీ మరల అస్వస్థత రాకుండునట్లు చేయుట
సాధ్యపడదు.
ఇచ్చట ఒక విషయాన్ని గమనించవలసి యుంది.
అది ఆరోగ్యమూ, బలమూ వేరు వేరు అన్నదే. వాటి మధ్యనున్న సాన్నిహిత్య సంబంధం వల్ల రెండూ
ఒక్కటిగా అనిపించవచ్చు. ఎందుకంటే బలవంతుడు అనారోగ్యానికి గురి కావడమూ, తగినంత క్రియా సామర్థ్యం లేకున్నా ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పడానికి వీలుండడమూ
వైద్యశాస్త్రానికి అనుభవంలో నున్న విషయమే. ఈ విషయం [బలమూ-ఆరోగ్యము రెండన్న సంగతి]
గమనించినారు కనుకనే ఆహారాన్ని రెండుగా వర్గీకరించారు. 1.
ఆరోగ్యదాయకములైనవి. 2. శక్తి, బలమూ
యివ్వగలిగినవి.
విటమినులూ, ఖనిజ లవణములూ మొదలైనవి ఆరోగ్యదాయకములుగనూ,
మాంసకృత్తులూ, తైల పదార్థములూ, పిండి పదార్ధములూ శక్తికీ, దేహ దారుఢ్యమునకూ
ఆలంబనములుగనూ విజ్ఞానశాస్త్రం తెలియజేస్తుంది. యోగశాస్త్ర ప్రతిపాదితమైన ఆహార
విధియందునూ ఈ యంగం ప్రకటింపబడింది. కనుకనే మనం తీసికునే ఆహారమునందు ఆకుకూరలూ,
పండ్లూ, పాలూ, మరికొన్ని
కాయగూరలూ ఆరోగ్యదాయకములుగనూ, పిండి పదార్థములూ, పప్పు పదార్థములూ-మాంసకృత్తులు-తైల పదార్ధములు బలసంధాయకములుగనూ ఉన్నవి.
ఇవి సమతౌల్యంగా ఉన్న ఆహారమే సంతులితాహారమవుతుంది. అట్టి యాహారము మరల వారి వారి
శరీర స్థితిని బట్టీ, వృత్తి వ్యాపారముల ననుసరించీ మిత
నిర్ణయం చేయబడి హితాన్ని కలిగిస్తుంది. అట్టిమితమైన సంతులితాహారాన్నే
యుక్తాహారమంటారు.
యోగం కూడా యుక్తాహార విహారములు లేక
దుఃఖనాశాన్ని కలిగించ లేదని గీత. మన యనుభవం కూడా అట్లే ఉంది. కనుక ఆహార స్వీకరణ
మొదట క్రమబద్ధం చేయబడాలి. అదిన్నీ ఆరోగ్యాన్ని మొదటనూ, పిదప దారుఢ్యమునూ ప్రాధాన్యత ననుసరించి
స్వీకరించాలి. మామూలుగా-సాధారణంగా- రెంటినీ జోడించి సాధించు కోవాలి ఆధ్యాత్మ
దృష్టినుండి అత్యంత ప్రధానమూ, సూక్ష్మమూనైన యీ యంశం వర్తమాన
ఆధ్యాత్మిక కేంద్రాలలోనూ, సమాజంలోనూ మరుగున పడి పోయింది. నవీన
తాత్వికులలో దీని ప్రాధాన్యతను గమనించిన వాడు వివేకానందుడు. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలవారు కావాలి అన్న ఆయన నినాదంలోని ఆంతర్యమిదే. “నాయమాత్మా
బలహీనేనలభ్యః” అన్న శృతి వచనం కూడా దీనిని సూచించునదే. బలోపాసన, బలోపాసన, బలోపాసన, శారీరక,
మానసిక, బౌద్ధికమైన బలాన్ని కలిగి వుండటం ఇదే
ఈనాటి అవసరం. (అయితే మూడు దేహాలకు చెందిన బలములూ పరస్పర అనుకూల సంబంధాలు కలిగి
(బుద్ధి శక్తి ననుసరిస్తూ) ప్రవర్తించగలగాలి. లేకుంటే బలం దుష్టత్వానికి కూడా బలం
చేకూర్చగలదు? ఏనాటి అవసరమైనా యిదే. ఎందుకంటే బలమే
కర్మకాధారం. కర్మే ఫలాన్ని పుట్టించగలదు గనుక. అయితే ఆ బలం పై మూడు దేహాల విషయంలోనూ
పొందబడవలసి ఉన్నప్పటికీ ప్రారంభం మాత్రం ఆరోగ్యాన్నీ, దారుఢ్యాన్నీ
యివ్వగల ఆహార స్వీకరణ నుండియే.
2.
అట్లు ఆయా వ్యక్తుల శారీరక స్థితిగతుల ననుసరించి స్వీకరింపబడిన యుక్తాహారము
శరీరానికి తగిన విధంగా వినియోగపడునట్లు క్రమబద్ధమైన పరిశ్రమ చేయవలసి ఉంది.
క్రమబద్ధ మైన పరిశ్రమ వలన శరీరావయవములన్నీ అవసరమైనంత మేర ఉత్తేజితములై కొంత
శక్తిని పదార్థమును ఖర్చు చేయుటచే, స్వీకరింపబడిన పదార్ధము
వినియోగము లోనికి వస్తుంది. కనుకనే, వ్యాయామం వల్ల శక్తి
ఖర్చు చేయబడ్డా పిదప స్వీకరించిన యాహారం అత్యధికంగా సద్వినియోగపడి, వంటబట్టి బలం
పుంజుకోబడుతుంది. 1. సంతులితాహార స్వీకరణమూ, 2. క్రమానుగత పరిశ్రమ ద్వారా దానిని శరీరం ఇముడ్చుకొనగలుగునట్లు చేయుట అను
ప్రక్రియల ద్వారా ఆరోగ్యమూ, దారుఢ్యమూ నిర్మాణము చేసికొనుట,
ఇది క్రమం. ఈ ప్రక్రియలోనే బహిష్కరణావయవముల నుద్దీపనము చేయుట,
తద్వారా శరీరగత మాలిన్యములను వెడలజేయుట కూడా అంతర్భాగ ముగ
నుంటున్నది.
ఇంత దనుక ప్రాథమిక సాధనమును శరీరమును
శక్తివంతముగ జేయుటను గూర్చి చెప్పబడింది. ఆ స్థితి ఆ జీవితం నిలిపి వుంచుకొనదగినదై
యుండుటచే పై క్రమాన్ని పాటించుట కూడా ఆ జీవితం అందరూ శీలించదగి యున్నది.
అట్లే సూక్ష్మ శరీరమును గూడా సరిచేయవలసి
ఉంది. ఏ దేహానికైనా ప్రక్రియ పైన చెప్పిందే. అది ఆహార విహారములను క్రమపరచడమన్నదే.
అయితే మానసిక శరీర స్వరూపాన్ని సంగ్రహంగా చూపి దాని ఆహార విహారములనుగూర్చి కూడా
కొద్దిగా సూత్రప్రాయంగా చెపుతాను. మానసిక శరీమన్నది భౌతిక శరీరాన్ని విడచి వేరుగా
ఉన్నట్లు మనకేమీ యనుభవంలో లేదు. వెనుకటి వాళ్లునూ మనస్సు కూడా స్వీకరించిన ఆహారపు
సూక్ష్మాంశ మేనన్న నిర్ణయం చేశారు. ఈనాటి విజ్ఞానశాస్త్రం కూడా మనస్సూ పదార్థ
వికారమే నంటున్నది. కనుక ఈ సూక్ష్మ శరీరం అవగాహనా సౌలభ్యం కోసం చెప్పుకొంటున్న
మనోమయ దేహానికిన్ని ఆహారవిహారాలు ఒకింత కారణంగా ఉంటున్నాయి. ఈ దేహం యిష్టాయిష్టాలకు
ప్రాతినిధ్యం వహిస్తుంది యిష్టాయిష్టములు జ్ఞానేంద్రియ పంచకం ద్వారా
స్వీకరిస్తున్న విషయానుభవజన్య జ్ఞానం నుండి ఏర్పడుతున్నవి. కనుక మనోకాయానికి రూపు,
జ్ఞానేంద్రియాల ద్వారా విషయ రూపంగా
స్వీకరిస్తున్న వాటినుండి ఏర్పడుతున్నదన్న మాట. కనుక ఈ కాయానికి ఆహారం ఇంద్రియ
విషయాలు కూడా అవుతున్నాయి. కనుక సూక్ష్మ శరీరానికి ఆహారం క్రమబద్ధంగా యివ్వడమనగా
ఎట్టి విషయాలను స్వీకరించాలి. ఎట్టివి విడవాలి. ఎంతవరకు స్వీకరించాలి అన్నది
పరిశీలించుకోవలసి ఉందన్నమాట.
అట్లే బౌద్ధిక కాయం (విజ్ఞానకాయం – విచక్షణా జ్ఞానం). ఈ శరీరం జ్ఞానరూపమై ఉంది. జ్ఞానాన్ని
ఎట్లార్జించాలి? దోషరహితమైన జ్ఞానమనగా నేమి? అట్లు దోషరహితమైన జ్ఞానం ఏర్పడకపోవుటకు గల అభ్యంతరాలేమి? వాటిని తొలగించుకొనుట ఎట్లు? ఈ విషయాలను పరిశీలించి
బుద్ధికి ఆహార రూపమైన జ్ఞానాన్ని – యివ్వ
కూడనిది, యివ్వ వలసింది - అన్న దృష్టినుండియూ, ఇప్పటికే దోష సహిత జ్ఞానం ఏ కోణం నుండిగాని, నీలో బుద్ధి రూపంలో చేరియున్న దానిని తొలగించుకొనడమూ అన్న దృష్టి నుండియూ,
ఇలా మూడు ప్రక్రియల ద్వారా బౌద్ధికమైన అర్హకాయాన్ని సాధించుకోవాలి.
ఆరోగ్య విషయమై మరో కోణాన్ని కూడా గమనించాలి.
జీవి మనుగడ- జీవనయాత్ర- ఉద్దిష్ట లక్ష్యం
వైపునకే కదలవలెనన్న దానికి తగిన దేహం అర్హకాయం పై మూడు దేహాల విషయంలోనూ అవసరం.
ప్రకృతి ఒక క్రమంలో సమ్మేళనం పొందడం వల్లనే
అట్టి దేహమేర్పడగలదు. ఆ క్రమత భంగపడిన అస్వస్థత ఏర్పడుతుంది. కనుక ఆ క్రమాన్ని
నిలిపి ఉంచుటకు మనిషి ప్రకృతిలో –
పంచభూతములతో సుసంబంధాన్ని కలిగి ఉండాలి. దానికై ప్రయత్న పూర్వకంగా ప్రకృతిని శుద్ధముగ
నుండునట్లు చేసికొనుట, అట్టి పరిశుద్ధ, నిర్మల వాతావరణములో జీవికను
సాగించుట అవసరమగుచున్నది. ఈ క్రమం యొక్క లోపమే నేటి నాగరిక ప్రపంచ శారీరక, మానసిక అనారోగ్య లక్షణములకు ప్రముఖ కారణమై ఉంది. తన యొక్క సాటి ప్రాణుల
యొక్క హితమును గూర్చి కోర్కెగల వారెల్లరూ ముందుగా ఈ విషయమును గమనించి వాతావరణ
కాలుష్యమును నివారించుటకై తనవంతు యత్నమును చేయుట, పరిశుద్ధ
వాతావరణముతో సంబంధము కలిగి యుండునట్లు చూసుకొనుట చేయవలయును.
ప్రకృతి చికిత్సా విధానము రోగకారణమున్నూ, తన్ని వారణమున్నూ ఈ యంశము పైనే యాధారపడి
యున్నవని తెలుపుచున్నది. “పరస్పరం భావయంతః - శ్రేయః పరమవాప్స్యధ॥” అన్న గీతావచనం
కూడా దీనిని వ్యక్తం చేయునదే. అట్లే యజ్ఞములూ, నిత్యాగ్ని
అన్న వాటి వెనుక కూడా వాతావరణ కాలుష్య నివారణ ఒక ఆశయంగా యిమిడి ఉంది. అయితే ఈ
విషయమూ లేమీ అతి రహస్యములు కాదు. కానీ అమలు పరుపబడుట లేదంతే. జీవనయాత్ర, గమనించుట - ఆచరించుట అన్న రెండు ముఖాలు కలిగి ఉంటుంది. ఇది గమనించి పై మూడు
దేహాల విషయంలోనూ ప్రస్తుతమున్న స్థితిని, ఉండవలసిన స్థితిని గమనించుట, గమనించిన
దానినుండి ఉండకూడనివి తొలగించుకుని ఉండవలసిన స్థితికై యత్నించుట జరుగవలసి ఉంది.
గమనించగలరు.
ఈ విషయమై
విపులవగాహన కోరువారు సంప్రదించగలరు. అభ్యాసము కోరువారున్నూ కలవవచ్చును.
సత్యాన్వేషణలో
మీ సురేంద్ర
పర్యావరణం
పర్యావరణ
శాస్త్రజ్ఞులను ఈ రోజు కలవర పెడుతున్న అంశం ప్రధానంగా వాతావరణ కాలుష్యమే ప్రకృతి సమతౌల్యతను
కోల్పోతూ ఉన్నది. అందువల్ల ముందు ముందు మానవ మనుగడకే (అస్థిత్వానికే) ముప్పు రావచ్చన్నదే
ఇప్పుడు వారి ముందున్న సమస్య. దీనికి కారణం అతిగా పెరిగిన విజ్ఞానం దుర్వినియోగం చేయబడడమే
నన్నది ఒక వాస్తవము. అయితే సామాజిక శ్రేయోదాయకులము, శ్రేయోకాములము అని చెప్పుకునే ఆయా సిద్ధాంతకారులీ
విషయాన్నెంతవరకు గుర్తించారు? గుర్తించినా ఈ సమస్యా
పరిష్కారానికై ఎంతవరకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు జ్ఞానులము, (కొందరి విషయములో) పరిపూర్ణులము అనుకునే ఆధ్యాత్మవేత్తలీ విషయాన్నసలు
గుర్తించారా? నిష్కర్షగా చెప్పాలంటే ఈ విషయాలేమీ వారికి పట్టవు
పైగా ఎవరైనా చెప్పినా అక్కర లేని విషయంగానో, అప్రధానమైన
యంశంగానో కొట్టివేస్తారు. ఎందుకని? “లోకాసమస్తా సుఖినోభవంతు”
అని వెనుకటి వాళ్ళన్న మాటను వర్ణించడమే గానీ దాని భావమేమి? అట్టి
స్థితి సమాజానికెట్లు సిద్ధిస్తుంది. అందుకై జరుగ వలసిన దానిలో తన బాధ్యత ఎంత?
అన్నదీ ఎక్కువ భాగం ఏ మాత్రమూ ఆలోచించరు. నిజంగా చెప్పాలంటే,
తమకు బాగానే గడచి పోతున్నది గదా! అన్నదే ఎక్కువమంది దృష్టి. ఇబ్బంది
కలిగించే విధంగా ఉన్నా ఇది ముమ్మాటికీ వాస్తవము. ఆరోగ్యమూ, బలమూ
అన్న విషయాలలో - ముడిపడి ఉన్న అంశమే కాక అసలు ప్రాణిజాతం అస్థిత్వానికే సవాలుగా
మారనున్న, మారుతున్న అంశమిది. అందరూ, అందరం
ఆలోచించవలసిన, వెంటనే తగిన విధంగా స్పందించవలసిన అంశమిది.
ఆలోచించగలరు. ప్రస్తుతాంశమును ముగిస్తాను. నమస్సులు.
No comments:
Post a Comment